TDP Leader Nara Lokesh Tour in Mangalagiri :రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా విభిన్న కుల, మతాల సమాహారంగా ఉన్న గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం సమగ్రాభివృద్ధి కోసం అందరూ కలసికట్టుగా ముందుకు రావాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో తటస్థ ప్రముఖులతో నారా లోకేశ్ వరుస భేటీలు కొనసాగుతున్నాయి. దుగ్గిరాల, మంగళగిరి మండలాల్లోని తటస్థులతో లోకేశ్ సమావేశం అయ్యారు.
Nara Lokesh Today Schedule :ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నియోజకవర్గంలో ప్రముఖులను ఇళ్లకు వెళ్లి కలుస్తూ తమ ఆలోచనలను వివరించి, వారి ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు నారా లోకేశ్. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులోని చెంచు సామాజికవర్గ పెద్ద తిరుపతయ్య కుటుంబసభ్యులు లోకేశ్‌ను సాదరంగా ఆహ్వానించారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. పొలాల్లో ఎలుక బుట్టలు పెట్టడం, చేపల వేట ఆధారంగా జీవనం సాగిస్తున్నారని, సంచార జాతిగా ఉన్న తమ సామాజిక వర్గీయులకు ప్రభుత్వ పథకాలు, స్వయం ఉపాధి రుణాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
మంగళగిరిలో లోకేశ్ పర్యటన - తటస్థులతో యువనేత భేటీ
లోకేశ్ దృష్టికి చేనేత వృత్తి సమస్యలు : వారి సమస్యలు విన్న రాబోయే 3 నెలల్లో ప్రజా ప్రభుత్వం వస్తోందని, చెంచులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందని హామీ ఇచ్చారు. మంగళగిరి మండలం పెదవడ్లపూడి లంబాడీ సామాజికవర్గ ప్రముఖులు జరపాల సాంబశివరావును ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకుని, వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. మంగళగిరిలోని ప్రముఖ చేనేత వ్యాపారి వెనిగళ్ల శంకర్రావు, కొల్లి శ్రీనివాస్‌లను కలుసుకున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగిన చేనేత సామాజిక వర్గీయులు వృత్తి పరంగా ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు.