Nara Lokesh challenged YCP leaders: స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి తనపై చేస్తున్న ఆరోపణలపై జగన్ రెడ్డికి, వైసీపీ నాయకులకు దమ్ముంటే 24 గంటల్లో ఆధారాలు బయటపెట్టాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఛాలెంజ్ చేశారు. ఆరోపణలు చేసి పారిపోవడం వైసీపీ నేతలకు అలవాటని ఆయన విమర్శించారు. వైసీపీ నేతలు మాదిరిగా అందరూ అవినీతిపరులే అని, ప్రజల్ని మభ్య పెట్టడానికే బురద జల్లే కార్యక్రమమని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడు ఏళ్ల 8 నెలలు అయ్యిందన్న లోకేశ్.. వారు చెయ్యని విచారణ లేదని మండిపడ్డారు. తనతోపాటు చంద్రబాబుపై చేసిన ఆరోపణల్లోనూ వాస్తవం లేదని తేలిపోయిందని తెలిపారు. తామూ వైసీపీ నేతల్లానే అవినీతికి పాల్పడి చిప్పకూడు తింటాం అనుకోవడం వారి అవివేకమన్నారు.
జగన్ రెడ్డికి పాలన చేతగాక ప్రజల్లో వ్యతిరేకత: ఇన్సైడర్ ట్రేడింగ్, ఫైబర్ గ్రిడ్, ఐటీ కంపెనీలు రాయితీలు, ఇలా అనేక విషయాల్లో తనపై అవినీతి బురద జల్లారని ఆరోపించారు. ఒక్క ఆరోపణలో కూడా ఆధారాలు చూపలేక పారిపోయారన్నారు. ఆఖరికి చంద్రబాబుపై వైసీపీ నేతలు ఎంతో అల్లరి చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసును కూడా కోర్టు కొట్టేసిందన్నారు. జగన్ రెడ్డికి పాలన చేతగాక ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతున్న వేళ మరోసారి ప్రజల దృష్టిని మరల్చేందుకు స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి అంటూ తనపై కొత్త ఆరోపణలు మొదలు పెట్టారని లోకేశ్ విమర్శించారు. వైసీపీ తనపై చేస్తున్న అన్ని ఆరోపణలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు తాను రెడీ అని సవాల్‌చేశారు. 24 గంటల సమయం ఇస్తున్నా స్కిల్ డెవలప్మెంట్తో సహా తన పై చేసిన ఆరోపణల్లో ఆధారాలు వైసీపీ బయటపెట్టాలని డిమాండ్‌చేశారు. ఆధారాలు బయటపెడతారో, ప్యాలెస్ పిల్లితో పాటు వైసీపీ పిల్లులు పారిపోతాయో 24 గంటలు వేచి చూద్దామని లోకేశ్ అన్నారు.