కోర్టు ధిక్కరణల్లో జగన్ ప్రభుత్వం గిన్నిస్ బుక్ రికార్డు TDP Leader Kanna Laxmi Narayana Fires on YSRCP Government: రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుల్ని గాలికి వదిలేసిందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత కన్నా లక్ష్మీ నారాయణ విమర్శించారు. వ్యవసాయ సీజన్ మొదలై.. కృష్ణా డెల్టాలో రైతులు నీటి కోసం ఎదురు చూస్తున్నా పట్టించుకోవటం లేదని ఆయన ఆరోపించారు. గుంటూరులో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజికి నీరు తెచ్చి.. కృష్ణా డెల్టాకు ఇచ్చే అవకాశాన్ని ప్రభుత్వం విస్మరించిందన్నారు.
చంద్రబాబుకు పేరు వస్తుందనే ఉద్దేశంతోనే సైకో ముఖ్యమంత్రి పట్టిసీమ ప్రాజెక్టును పక్కనపెట్టారని దుయ్యబట్టారు. ఓ వైపు లక్షల క్యూసెక్కుల నీరు గోదావరి నుంచి సముద్రంలో కలుస్తున్నా.. ఆ నీటిని కృష్ణా డెల్టాకు మళ్లించాలనే ఆలోచన ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు. జులై 20వ తేదీ వచ్చినా ఇప్పటి వరకూ కనీసం సాగునీటి కాలువలు, డ్రెయిన్లు మరమ్మతులు చేయకపోవటాన్ని తప్పుబట్టారు. రైతులే చాలా చోట్ల చందాలు వేసుకుని కాలువలు రిపేర్ చేసుకుంటున్నారని విమర్శించారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే వరకూ రైతులకు ఇబ్బంది ఉండరాదనే చంద్రబాబు పట్టిసీమ కట్టించారని కన్నా పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తి చేసే పరిస్థితి లేదని తెలిపారు. పట్టిసీమ నుంచి వెంటనే కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాలువల మరమ్మతులు ఇప్పటి వరకూ చేయకపోవడం గతంలో ఎప్పుడూ లేదని కన్నా వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వానికి ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచనే లేదని దుయ్యబట్టారు.
Kanna Fires on CM Jagan Ruling: అలాగే అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకోవటం, కోర్టులను ధిక్కరించటంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గిన్నిస్ బుక్ రికార్డు సాధించిందని కన్నా లక్ష్మీ నారాయణ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నదీగర్భాల్లో అక్రమంగా ఇసుక తవ్వి తరలించటంపై ఆయన స్పందించారు. కోర్టు తీర్పులన్నా జగన్మోహన్ రెడ్డికి లెక్కలేదని వ్యాఖ్యానించారు. 153సీట్లు వచ్చాయని రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారమే పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలపై దాడులు చేసి మళ్లీ వారిపైనే కేసులు పెడుతున్నారని విమర్శించారు. డీజీపీ సహా పోలీసు ఉన్నతాధికారులు ఇంతలా దిగజారిన పరిస్థితి రాష్ట్రంలో ఎప్పుడూ లేదని విమర్శించారు. పోలీసులు ప్రజాస్వామిక విలువలు కాపాడే ప్రయత్నం చేయాలని కన్నా వ్యాఖ్యానించారు.
"గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో జగన్ మోహన్ రెడ్డి పాలనను ఎక్కించొచ్చు. ఎందుకంటే అప్రజాస్వామ్యంగా కోర్టులను కూడా ధిక్కరించి తన సొంత రాజారెడ్డి రాజ్యాంగం ద్వారా ఈ రాష్ట్రంలో అరాచక కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ ఆరాచకాల్లో భాగంగానే ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా సాగుతోంది. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వులతో మాకేంటి సంబంధం.. మాకు 153 మంది శాసన సభ్యులు ఉన్నారు కాబట్టి మా రాజ్యాంగామే చెల్లుతుంది అనే భావన ముఖ్యమంత్రికి ఉంది."-కన్నా లక్ష్మీ నారాయణ, టీడీపీ నేత