TDP Leader Kala Venkatarao fire on Jagan about BCs : బీసీలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి నీతిలేని రాజకీయం చేస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు దుయ్యబట్టారు. పథకాలు ఆపేసి, సబ్సిడీలు రద్దు చేసి జగన్ ఏం ఉద్దరించారంటూ మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బీసీలకు ఎటువంటి న్యాయం జరగలేదంటూ ఆయన పత్రిక ప్రకటన విడదల చేశారు. నిధులు, విధులు లేని పదవులు బీసీలకా, నిధులు అధికారాలు సొంత వారికా అని ప్రశ్నించారు. బీసీలంటే బ్యాక్ వార్డ్ కులాలు కాదని.. బ్యాక్ బోన్ కులాలని టీడీపీ నిరూపించిందని ఆయన పేర్కొన్నారు. బీసీల వెన్నెముకను విరగ్గొట్టిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీసీ సమస్యలపై లోకేశ్ చర్చించడంతో జగన్ రెడ్డి అండ్ కో వెన్నులో వణుకు మొదలైందని అన్నారు. బీసీ అనే పదం పలికే అర్హత కూడా జగన్ రెడ్డికి, వారి ముఠాకు లేదని స్పష్టం చేశారు. జగన్ రెడ్డి నాలుగున్నరేళ్ల పాలనంతా బీసీల భక్షణే అని అన్నారు. కులం చూడం.. మతం చూడం అంటూ.. బీసీల బతుకుల్ని ఛిద్రం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ రుణాలిచ్చి, పని ముట్లిచ్చి, చేతి వృత్తుల ఆర్ధిక ఎదుగుదలకు ప్రోత్సహించిందని, రిజర్వేషన్లతో రాజకీయ అవకాశాలిచ్చి ప్రోత్సహించిందని తెలిపారు. నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యమిచ్చి సామాజికంగా ప్రోత్సహించిందన్నారు. పదవులు లాక్కుని, నిధులు లాక్కుని, రిజర్వేషన్లు లాక్కుని జగన్ రెడ్డి అణగదొక్కుతున్నాడంటూ మండిపడ్డారు.
నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ అన్న జగన్ రెడ్డి.. సలహాదారుల్లో రిజర్వేషన్ ఎందుకు లేదని నిలదీశారు. ఏపీఐఐసీ, టీటీడీ, ఏపీఎస్ఆర్టీసీ లాంటి పెద్ద సంస్థల్లో రిజర్వేషన్ ఎందుకు లేదని ప్రశ్నించారు. బలహీన వర్గాలంటే బలహీన పదవులకే పరిమితమా అని నిలదీశారు. రేషన్, పెన్షన్, ఖర్చును కూడా బీసీల ఖర్చుగా చూపేందుకు సిగ్గుండాలని అన్నారు. రేపల్లె హత్య వెనుక రాజకీయ కుట్ర లేదా, నందం సుబ్బయ్య హత్యలో రాజకీయం లేదా జగన్ రెడ్డీ అంటూ దుయ్యబట్టారు. బీసీలను భక్షిస్తున్న జగన్ రెడ్డికి భజన చేయడానికి వైసీపీలోని బీసీ నేతలు సిగ్గుపడాలని ఆయన పేర్కొన్నారు.
బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తాం :వెనుకబడిన తరగతుల రక్షణ కోసం టీడీపీ అధికారంలోకి రాగానే కఠినమైన చట్టాలను తీసుకువస్తామని ఆ పార్టీ జాతీయ కార్యదర్శినారా లోకేశ్ ప్రకటించారు. యువగళం పాదయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన జయహో బీసీ సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం హయంలో బీసీలను లక్ష్యంగా చేసుకొని దాడులు పెరిగిపోయాయని, అనేక మంది బీసీలు హత్యలకు గురయ్యారని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటి మాదిరిగా బీసీల రక్షణకు చట్టాలను తీసుకు వస్తేనే వారి జీవితాలకు భద్రత ఉండదని ఆయన అన్నారు.
రాజకీయాల్లో, పార్టీ పదవుల్లో, చట్టసభల్లో కూడా టీడీపీ బీసీలకు పెద్ద పీట వేస్తున్నామని తెలిపారు. బడుగు బలహీన వర్గాల కోసం.. పట్వారీ వ్యవస్థను రద్దు చేసేందుకే ఎన్టీఆర్ పార్టీ పెట్టారని గుర్తు చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు హయంలో బీసీలకు అనేక రకాలుగా ఆదుకున్నామన్నారు. ఈ ప్రభుత్వంలో బీసీ సంక్షేమమే మరిచిపోయిందని, వృత్తి పని వారికి ఒక్కరికి కూడా పనిముట్ల పంపిణీ చేయలేదని లోకేశ్ విమర్శించారు.