ముఖ్యమంత్రి జగన్ ప్రోద్భలంతోనే రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ విగ్రహాలు తొలగించటం, ధ్వంసం చేయటం జరుగుతోందని తెదేపా నేత జీవీ ఆంజనేయులు విమర్శించారు. అనుమతులు లేకుండా పెట్టిన వైఎస్ విగ్రహాలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయన్నారు. వాటిని కదిలించని ప్రభుత్వం.. ఎన్టీఆర్, ఇతర తెదేపా నేతల విగ్రహాలు తొలగించటం ముమ్మాటికీ కక్ష సాధింపేనని మండిపడ్డారు. వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మంత్రి పదవి కోసం 300 మంది పోలీసులను అడ్డుపెట్టుకొని ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహాలను తొలగించారని ఆరోపించారు.
రాష్ట్రంలో ఎన్టీఆర్ విగ్రహాలను ఎక్కడైతే తొలగించారో.., వాటిని యథాస్థానంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు వైకాపాకు అధికారమిచ్చింది విగ్రహాలు తొలగించడానికి, దేవాలయాలు ధ్వంసం చేయడానికి కాదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అభివృద్ధిని విస్మరించి దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.