TDP LEADER GANTA LETTER TO CM JAGAN : సీఎం జగన్‌కు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు గంటా శ్రీనివాసరావు లేఖ రాశారు. పెట్టుబడుల సమావేశానికి ముందు ప్రభుత్వానికి గంటా కొన్ని ప్రశ్నలు సంధించారు. పెట్టుబడుల స్వర్గధామం అయిన దావోస్‌లో ఇటీవల జరిగిన వరల్డ్ ఎకానిమిక్ ఫోరంకు వెళ్లకపోవడానికి గల కారణాలను తెలుపగలరా అని ప్రశ్నించారు. దాని వల్ల రాష్ట్ర ప్రతిష్ఠ ఎంత దెబ్బతిందో కనీసం ఇప్పటికైనా గుర్తించారా అని నిలదీశారు. ఒక రాజధానినే నిర్మించుకోలేని రాష్ట్రంలో పెట్టుబడిదారులకు ఎలాంటి నమ్మకాన్ని కలిగించగలం అని మండిపడ్డారు.
జాకీ కంపెనీ రాష్ట్రంలో ఉండలేమని పారిపోతుంటే, కారణాలని విశ్లేషించి ఆ తప్పులను సరిదిద్దుకుని పునరావృత్తం కావు అన్న భరోసా ఇచ్చారా అని ప్రశ్నించారు. కియా కంపెనీకి అనుబంధ కంపెనీలను ఒక్కటీ తీసుకురాలేకపోయినందుకు ఆత్మ సమీక్ష చేసుకున్నారా అని నిలదీశారు. హెచ్బీసీని ఇక్కడి నుంచి వెళ్లకుండా కనీసం ప్రయత్నం చేశారా అని ప్రశ్నించిన గంటా.. లులూ, అమరరాజాను ఇక్కడి నుంచి తరిమేశామని సదస్సులో చెబుతారా అని ఎద్దేవా చేశారు.
భోగాపురం విమానాశ్రయానికి నాలుగేళ్ల నుంచి శంకుస్థాపన చేయకుండా వదిలేసి ఇప్పుడు ఎందుకు హడావుడి చేస్తున్నారని విమర్శించారు. నాలుగు సంవత్సరాలలో రాష్ట్రంలో అప్పటికే నిర్మించిన పోర్టులను తప్ప.. కొత్తగా ఒక్క పోర్టును అయినా అభివృద్ధి చేశారా అని నిలదీశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలకు ఎటువంటి నమ్మకం కలిగించకుండా.. సదస్సు పెట్టెంత సాహసం చేయడం వెనుక ఉన్న మీ కాన్ఫిడెన్స్‌ను ఏ విధంగా అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని చెప్పి పెట్టుబడులను ఆహ్వానించగలమా అని నిలదీశారు.