'ప్రజాసమస్యలు పట్టించుకోకుండా.. ప్రతిపక్షాలపై దాడా..?' - గుంటూరు తాజా వార్తలు
వైకాపా కక్షపూరిత రాజకీయాలు మానుకొని ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని తెదేపా నేత నసీర్ అహ్మద్ అన్నారు. ప్రతిపక్షాలపై ఎదురుదాడే లక్ష్యంగా విలువైన శాసనసభ సమయాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు.
సీఎం జగన్ హామీలను తుంగలో తొక్కారని తెదేపా నేత ఎద్దేవా
అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యల గురించి చర్చించకుండా... ప్రతిపక్షాలపై ఎదురుదాడే లక్ష్యంగా వైకాపా పనిచేస్తుందని తెదేపా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇంఛార్జీ నసీర్ అహ్మద్ ఆరోపించారు. వైకాపా నేతలు విలువైన శాసనసభ సమయాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. గుంటూరు తెదేపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన... అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవహరిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారన్నారు. మాట తప్పం, మడమ తిప్పం అన్న జగన్... చెప్పినవన్నీ అవాస్తవాలని ఆరోపించారు. ప్రజలు ఉల్లిపాయలు కొనాలంటే భయపడుతున్నారని అన్నారు. సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలు మానుకుని, ప్రజల కోసం పని చేయాలని హితవు పలికారు.