విశాఖలో భూముల వ్యాపారం కోసమే ముఖ్యమంత్రి జగన్ రాజధానిని తరలిస్తున్నారని మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. అమరావతి రైతుల ఉద్యమం చేపట్టి 175 రోజులైన సందర్భంగా... రాజకీయ, రాజకీయేతర ఐకాస నేతలు గుంటూరు తెదేపా కార్యాలయంలో దీక్ష చేపట్టారు. ఐకాస నేతలతో దీక్షలు విరమింపజేసిన అనంతరం మాట్లాడిన దేవినేని.. అమరావతి పేరు ఎత్తడానికి సైతం సీఎం జగన్ ఇష్టపడడం లేదని విమర్శించారు.
విశాఖలో రాజధాని ఏర్పాటుకు రెండు ముహూర్తాలు దాటిపోయాయని.. ఇప్పుడు కొత్త ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారని దేవినేని ఉమా ఎద్దేవా చేశారు. అమరావతి కోసం 65 మంది మరణించినా... జగన్ వారి కుటుంబాలను పరామర్శించకపోవటాన్ని తప్పుబట్టారు. రైతులంటే జగన్కు అంత ద్వేషం ఎందుకని ప్రశ్నించారు. ఐదు కోట్ల ఆంధ్రుల కల అమరావతి అని... ప్రజా రాజధానిగా అమరావతే కొనసాగుతుందని దేవినేని విశ్వాసం వ్యక్తం చేశారు.