TDP Leader Buddha Venkanna on Sharmila Witness: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కేంద్ర దర్యాప్తు సంస్థ 259వ సాక్షిగా చేర్చిన సంగతి తెలిసిందే. వివేకా హత్య కేసులో గత సంవత్సరం షర్మిల దిల్లీలో వాంగ్మూలం ఇచ్చారు. తన వద్ద ఆధారాలు లేవు కానీ రాజకీయ కారణాలతోనే హత్య జరిగిందని షర్మిల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివరించింది. హత్యకు కుటుంబ, ఆర్థిక కారణాలు కాదన్న షర్మిల.. అంతకు మించి పెద్దకారణమే ఉందని వెల్లడించింది. అవినాష్ కుటుంబానికి వ్యతిరేకంగా వివేకానంద రెడ్డి నిలబడటమే ఆయన హత్యకు కారణమై ఉండొచ్చని వాంగ్మూలంలో పేర్కొంది. అయితే షర్మిల వాంగ్మూలం పై తెలుగుదేశం పార్టీ నేత బుద్ధా వెంకన్న పలు వ్యాఖ్యలు చేశారు.
షర్మిలకు.. సీఎం జగన్‌మెహన్‌రెడ్డి, కడప ఎంపీ అవినాష్‌రెడ్డిల నుంచి ప్రాణహాని పొంచి ఉందని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసులో సాక్ష్యం చెప్పిన షర్మిలకు కేంద్రం వై కేటగిరి భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ వివేకా హత్య వల్ల ఆ కుటుంబం ఎంత నష్టపోయిందో.. రాష్ట్ర ప్రజల కూడా అంతే నష్టపోయారని అన్నారు. వివేకా హత్య తర్వాత తెలుగుదేశంపై ఆరోపణలు చేసి సానుభూతి ఓట్లతో జగన్ గెలిచారని విమర్శించారు. జగన్ గెలవడం వల్లే ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
షర్మిలకు జగన్మోహన్రెడ్డి, అవినాష్‌రెడ్డిల నుంచి ప్రాణహాని పొంచి ఉంది. వివేకా హత్య కేసులో సాక్ష్యం చెప్పిన షర్మిలకు కేంద్రం వై కేటగిరి భద్రత కల్పించాలి. షర్మిలకు ఎంపీ సీటు ఇవ్వకూడదని జగన్ భావిస్తే, ఇప్పించాలని వివేకా పట్టుబట్టారు. వివేకా అడ్డుగా ఉన్నారనే హత్య చేశారు. లోటస్ పాండ్ లోనే వివేకా మర్డర్‌కు స్కెచ్ వేశారు. వివేకా హత్య విషయం తెలిసిన వెంటనే జగన్ పులివెందులకు ఎందుకు వెళ్లలేదు..?. పులివెందులకు వెళ్లాక జగన్ నేరుగా వివేకా మృతదేహం వద్దకు వెళ్లకుండా.. ఇంటికి ఎందుకెళ్లారు..?.-బుద్దా వెంకన్న, టీడపీ నేత
వైఎస్ వివేకా హత్య కేసులో షర్మిల చెప్పినవి వాస్తవాలన్న బుద్దా వెంకన్న.. షర్మిలకు ఎంపీ సీటు ఇవ్వకూడదని జగన్ భావిస్తే, ఇప్పించాలని వివేకా పట్టుబట్టారని అన్నారు. అందుకు వివేకా అడ్డుగా ఉన్నారనే హత్య చేశారని ఆరోపించారు. లోటస్ పాండ్ లోనే వివేకా మర్డర్‌కు స్కెచ్ వేశారన్నారు. వివేకా హత్య విషయం తెలిసిన వెంటనే జగన్ పులివెందులకు ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. పులివెందులకు వెళ్లాక జగన్ నేరుగా వివేకా మృతదేహం వద్దకు వెళ్లకుండా.. ఇంటికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు.
హత్య విషయం ఉదయం తెలిస్తే సాయంత్రం ఐదు గంటలకు వెళ్లడం ఏంటని మండిపడ్డారు. వివేకా హత్య కేసులో జగన్ సూత్రధారి.. అవినాష్ పాత్రధారి అని ఆరోపించారు. వివేకా హత్య విషయమై ఇంకా లోతైన దర్యాప్తు జరగాలని పేర్కొన్నారు. జగన్ గురించే కాదు.. ఆయన వెనుక ఎవరున్నారో కూడా తేలాలని డిమాండ్ చేశారు. సునీతా రెడ్డి.. ఓ సైకో సీఎం మీద పోరాడుతుండటం మామూలు విషయం కాదని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.