గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచి, తెలుగుదేశం పార్టీ కీలక నేత పురంశెట్టి అంకులు (65) ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. దాచేపల్లి పట్టణంలోని ఓ అపార్టుమెంటు వద్ద గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను గొంతు కోసి హతమార్చారు.
ఒక ఫోన్‌కాల్ రావటంతో సొంతూరి నుంచి అంకులు దాచేపల్లికి ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో వెళ్లారు. కారును రహదారిపై నిలిపి నిర్మాణంలో ఉన్న అపార్టుమెంటు వద్దకు ఒంటరిగా వెళ్లారు. తర్వాత కొద్దిసేపటికే మొదటి అంతస్థులో శవమయ్యారు. ఒంటరిగా వెళ్లిన అంకులు తిరిగి రాకపోయేసరికి డ్రైవరుకు అనుమానం వచ్చి అక్కడకు వెళ్లి చూడగా మృతదేహం కనిపించింది. కాసేపటికి తెదేపా నాయకులు అక్కడకు చేరుకొని ఆందోళన చేపట్టారు. హత్యకు నిరసనగా అద్దంకి- నార్కట్‌పల్లి రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పెదగార్లపాడుకు అంకులు పదేళ్లపాటు సర్పంచిగా పనిచేశారు. ఆయన భార్య పున్నమ్మ సర్పంచిగా, కుమారుడు పరంజ్యోతి ఎంపీటీసీ సభ్యునిగా పనిచేశారు. దాచేపల్లి సమీపంలో నిర్మించిన సిమెంటు కర్మాగారానికి భూసేకరణలో కీలకపాత్ర వహించారు.