TDP Janasena Joint Protest: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రోడ్ల దుస్థితిపై తెలుగుదేశం-జనసేన ఆధ్వర్యంలో.. గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది సీఎం పేరుతో నిరసనలు చేపట్టారు. అధ్వానంగా తయారైన రహదారులతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వానికి తెలిజేసేలా ఆందోళనకు దిగారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రహదారులు నిర్మించాలని టీడీపీ-జనసేన నాయకులు డిమాండ్ చేశారు.
TDP Janasena Joint Protest In Guntur : రాష్ట్రంలో రహదారుల దుస్థితిని నిరసిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుదేశం, జనసేన పార్టీ నేతలు నిరసన తెలిపారు. వడ్లపూడి రహదారిపై నిరసన చేసిన నాయకులు రోడ్ల దుస్థితిని ప్రజలకు వివరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంగళగిరి అభివృద్ధికి ముఖ్యమంత్రి నిధులు కేటాయించారన్న వైసీపీ నేతలు ఈ రహదారిని ఎందుకు బాగుచేయలేదో సమాధానం చెప్పాలని నిలదీశారు.
TDP Janasena Protest In NTR District: ఎన్టీఆర్ జిల్లా మైలవరం జి.కొండూరు రహదారుల దుస్థితిపై గడ్డమణుగు నుండి జి.కొండూరు వరకు టీడీపీ, జనసేన సంయుక్తంగా ‘గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది’ కార్యక్రమం పేరుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పాదయాత్రలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, జనసేన ఇంఛార్జి అక్కల రామ్మోహన్ రావు (గాంధీ), టీడీపీ జనసేన శ్రేణులు పాల్గొన్నారు. గుంతలనైనా పూడ్చలేని చేతకాని ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంతలను మట్టితో పూడ్చాలని ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకోవడం.. దుర్మార్గమని దుయ్యబట్టారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన నిరసన:పశ్చిమగోదావరి జిల్లా తణుకు తెలుగుదేశం-జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అత్తిలి మండలం కేసముద్రం గట్టు గ్రామంలో గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది అంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. కేసముద్రం గట్టు గ్రామం వద్ద పాదయాత్ర ప్రారంభించి అత్తిలి వరకు సుమారు మూడు కిలోమీటర్లు పరిధిలో రహదారి గుంతల వద్ద ఇరుపార్టీల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సమస్యల సవాళ్లతో ఆటోనగర్ విలవిల - రోజు గడవడం లేదంటూ మెకానిక్‌ల ఆవేదన
ప్రకాశం జిల్లాలో ఇరుపార్టీల ర్యాలీ: ప్రకాశం జిల్లా కనిగిరి రోడ్ల అధ్వాన స్థితిని చూపిస్తూ.. టీడీపీ - జనసేన నేతలు ఆందోళన చేశారు. టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద నుంచి ఇరు పార్టీల నాయకులు ర్యాలీ నిర్వహించారు. భారీ గోతులను చూపుతూ స్థానిక అర్బన్ కాలనీ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. వైసీపీ మోసపూరిత పాలనలో ప్రజలు నష్టపోయిన విధానాన్ని ఓ మహిళ పాట రూపంలో వివరించారు.
శ్రీకాకుళంలో టీడీపీ జనసేన ఆందోళన: శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస, చింతాడ రోడ్లపై టీడీపీ - జనసేన నాయకులు ఆందోళన చేపట్టారు. శ్రీకాకుళం ఆముదాలవలస ప్రధాన రహదారి నిర్మాణాన్ని.. నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో పూర్తిచేయలేకపోయారని ధ్వజమెత్తారు. గుంతల కారణంగా ఆముదాల వలస రహదారిపై సుమారు 27 మంది మృతి చెందారని.. తరచూ ప్రజలు ప్రమాదాలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
TDP Janasena Protest in Satya Sai District: శ్రీ సత్యసాయి జిల్లాలో పెనుకొండ నుంచి కోనాపురం వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయం అయ్యిందంటూ.. టీడీపీ - జనసేన నాయకులు అన్నారు. టీడీపీ అధ్యక్షుడు బి.కె పార్థసారథి, జనసేన నియోజకవర్గ బాధ్యుడు కుమార్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రోడ్లు నరకానికి దారులు అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ నాలుగున్నరేళ్ల పాలనలో కనీసం గుంతలను పూడ్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నరసరావుపేట బైపాస్ రోడ్డుపై ప్రయాణించాలంటే 'కత్తి మీద సాములాంటిదే' బాబు!
అనంతపురం జిల్లాలో ఆందోళన: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం మండలంలో అధ్వానంగా ఉన్న రోడ్డుపై తెలుగుదేశం, జనసేన నాయకులు నిరసన తెలిపారు. టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో తెలుగు యువత, నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు. కళ్యాణదుర్గం నుంచి కన్నేపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కంకరతేలిన రోడ్డుపై మోకాళ్లపై కూర్చొని టీడీపీ -జనసేన నాయకులు ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.