TDP Janasena Combine Meetings: అరాచక పాలనను అంతమొందించాలంటే తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పని చేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ నేతలు, జనసేన నేతల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో మంగళగిరిలో నారా లోకేశ్‌ను గెలిపించేందుకు కలిసి పని చేస్తామని రెండు పార్టీల నేతలు తీర్మానించారు. ఈ నెల 18, 19 తేదీలలో నియోజకవర్గంలోని రహదారుల దుస్థితిపై డిజిటల్ వార్ చేయాలని పేర్కొన్నారు. నియోజకవర్గంలో నిర్వహించే భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాలని, ఓటర్ల జాబితాలోని తప్పులను ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించారు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. పట్టణంలోని చౌడేశ్వరి కాలనీలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అధ్యక్షతన కొనసాగింది. పెద్దఎత్తున జనసేన, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ సమావేశంలో పాల్గొన్నాయి.
వైసీపీ అరాచక పాలన అంతమే లక్ష్యం : తెలుగుదేశం-జనసేన జేఏసీ నేతలు
విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ, జనసేన సమీక్ష సమావేశం జరిగింది. టీడీపీ దక్షిణ నియోజకవర్గ ఇంఛార్జ్ గండి బాబ్జి, జనసేన పీఏసీ సభ్యులు కోన తాతారావు సారథ్యంలో ఈ సమావేశానికి టీడీపీ జనసేన కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు.. రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనించాలంటే టీడీపీ జనసేన కూటమీ వల్లే సాధ్యమని అన్నారు.
విజయనగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ - జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతి రాజు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని, విజయనగరం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు ఆర్పీ భంజ్‌దేవ్ పాల్గొన్నారు. వీరితోపాటు తెలుగుదేశం, జనసేన పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు.
కృష్ణాజిల్లా పామర్రులో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకుల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పామర్రు నియోజకవర్గ బాధ్యుడు వర్ల కుమార్ రాజా, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకుడు కోటా వీరబాబు, జనసేన పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు తాడిశెట్టి నరేశ్, నీయోజకవర్గ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరుపార్టీల నాయకులు మాట్లాడుతూ.. పార్టీలపరంగా, వ్యక్తుల పరంగా అభిప్రాయాలు వేరైనా.. వైసీపీను ఓడించటమే లక్ష్యంగా ముందుకు సాగి.. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అందరు కలిసి పనిచేయాలని సూచించారు.
సంక్షేమం, అభివృద్ధే ఎజెండాగా నేడు టీడీపీ- జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకుల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణారెడ్డి, టీడీపీ సీనియర్ నేతలు.. శ్రీరామ్ తాతయ్య, ఆచంట సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడిన నేతలు.. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సమస్యలపై కలిసి పోరాటం చేయాలని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు వైసీపీ కుటిల ప్రయత్నాలు చేస్తోందని, వాటిని అడ్డుకొని ముందుకు సాగేందుకు అందరు కలిసి పనిచేయాలని సూచించారు.
ప్రకాశం జిల్లా దర్శిలో తెలుగుదేశం ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీడీపీ దర్శి నియోజకవర్గ పరిశీలకుడు నాదెండ్ల బ్రహ్మం చౌదరి, జనసేన పార్టీ దర్శి ఇంఛార్జ్ బొటుకు రమేశ్ పాల్గొన్నారు. బ్రహ్మం చౌదరి మాట్లాడుతూ.. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్ వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించాడన్నారు. బీహార్ నుంచి ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తిని కోట్ల రూపాయలు వెచ్చించి సలహాదారుడుగా తెచ్చుకుని గత ఎన్నికల్లో కులాలకు, మతాలకు మధ్య చిచ్చు పెట్టి వర్గాలుగా విడదీసి రాజకీయ లబ్ధి పొందాడన్నారు.
టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన - హరిరామ జోగయ్య కీలక సూచనలు