ఆందోళనలో గాయపడిన మహిళకు లోకేశ్ పరామర్శ
పోలీసులు మహిళలతో అమానుషంగా ప్రవర్తిస్తున్నారని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. మందడంలో ఆందోళనల సందర్భంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళను ఆయన పరామర్శించారు.
అమరావతి పరిరక్షణ కోసం చేసిన ఆందోళనల్లో తీవ్రంగా గాయపడిన మందడం గ్రామ వాసి శ్రీలక్ష్మి.. ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పరామర్శించారు. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి... ఘటన వివరాలు తెలుసుకున్నారు. మహిళ అని చూడకుండా పోలీసులు దారుణంగా ప్రవర్తించారని బాధిత కుటుంబీకులు లోకేశ్ ఎదుట ఆవేదన చెందారు. తమపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారని వాపోయారు. స్పందించిన లోకేశ్.. పోలీసులు అరాచకంగా వ్యవహరించారని ఆగ్రహించారు. మహిళలతో అమానుషంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. గుంటూరు ఎస్పీ లాఠీ పట్టుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. డీజీపీ కుటుంబ సభ్యులతో పోలీసులు ఇలాగే ప్రవర్తిస్తారా అని నిలదీశారు. ప్రజల ఇళ్లలోకి పోలీసులు బూట్లతో ప్రవేశించడం మంచి పద్ధతి కాదని హితవు చెప్పారు. మహిళలు దుర్గ గుడికి వెళ్తుంటే అరెస్టు చేయడం ఏంటని ఆగ్రహించారు.