ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TDP Fires on CID About Fiber Grid Allegations: 'ఆదాయం వస్తుండగా.. కుంభకోణానికి ఆస్కారం ఎలా..! సీఐడీ ఆరోపణలు నిరాధారం'

TDP Fires on CID About Fiber Grid Allegations : ఫైబర్‌ గ్రిడ్‌పై వైసీపీ నేతలు, సీఐడీ అధికారులవి నిరాధార ఆరోపణలని టీడీపీ ధ్వజమెత్తింది. 291 కోట్ల రూపాయలు ఖర్చయిన ఫైబర్‌ గ్రిడ్‌ ’ప్రాజెక్టు ద్వారా ఐదు సంవత్సరాలలో ప్రభుత్వానికి 850 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపింది. అలాంటప్పుడు వందల కోట్ల కుంభకోణానికి ఆస్కారం ఎక్కడుందని ప్రశ్నించింది. చంద్రబాబుకి డబ్బులిచ్చామని చెప్పాలంటూ వివిధ సంస్థలను సీఐడీ తీవ్రంగా వేధిస్తుందని మండిపడింది.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 21, 2023, 7:44 AM IST

TDP_Fires_on_YSRCP_CID_About_Fiber_Grid_Allegations
TDP_Fires_on_YSRCP_CID_About_Fiber_Grid_Allegations

TDP Fires on YSRCP CID About Fiber Grid Allegations: "ఆదాయం వస్తుండగా.. కుంభకోణానికి ఆస్కారం ఎలా"

TDP Fires on YSRCP CID About Fiber Grid Allegations: ఆంధ్రప్రదేశ్‌ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు మొత్తం వ్యయం 291 కోట్ల రూపాయలు. అయిదేళ్లలో ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి 850 కోట్లు ఆదాయం వచ్చింది. నిర్వహణ వ్యయం, ఎంఎస్‌వో కమీషన్లు తీసేసినా.. పెట్టిన పెట్టుబడి ఎప్పుడో వచ్చేసింది. అలాంటప్పుడు దీనిలో వందల కోట్ల కుంభకోణానికి ఆస్కారం ఎక్కడుందని జగన్‌ ప్రభుత్వాన్ని టీడీపీ నిలదీసింది.

ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుపై 2021 సెప్టెంబరులో కేసు నమోదు చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ విచారణ పేరిట అనేక మందిని హింసించిన సీఐడీ అధికారులు.. ఇప్పుడు చంద్రబాబును నిందితుడిగా చేర్చి ఆయన ప్రతిష్ఠ దెబ్బతీయాలని చూస్తున్నారని ధ్వజమెత్తింది. అందులో భాగంగానే చంద్రబాబుకు డబ్బులిచ్చామని చెప్పాలంటూ వివిధ సరఫరా సంస్థల ప్రతినిధులను జగన్‌ ప్రభుత్వం, సీఐడీ తీవ్రంగా హింసిస్తోందని ఆరోపించింది.

చంద్రబాబుకు డబ్బులు వెళ్లాయని చెప్పాలంటూ సీఐడీ తమను వేధిస్తోందంటూ ఫాస్ట్‌లేన్‌ అనే సంస్థ హైకోర్టులో ఇప్పటికే పిటిషన్‌ సైతం దాఖలు చేసినట్లు వివరించింది. ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు వ్యవహారంపై వైకాపా నేతలు, సీఐడీ చేస్తున్న నిరాధార ఆరోపణలను తెదేపా తీవ్రంగా ఖండించింది. వాస్తవాలను ఓ ప్రకటన రూపంలో విడుదల చేసింది.

'ఏపీ ఫైబర్ గ్రిడ్​కి వెంటనే నిధులు విడుదల చేయండి'

ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు కాంట్రాక్టు 321 కోట్ల రూపాయలకు ఇచ్చి.. ఆ తర్వాత టెరాసాఫ్ట్‌ ఆమోదంతో 291 కోట్లకు తగ్గించామని తెలిపింది. ఈ రోజుకీ 11 కోట్ల విలువైన బిల్లులు ఆ సంస్థకు చెల్లించకుండా తొక్కి పెట్టారంది. ఆ ప్రాజెక్టుపై తాము ఖర్చు చేసిన 291 కోట్లకు సంబంధించిన బిల్లులన్నీ ఏపీడీఆర్‌ఐకి సమర్పించి తమకు జరిగిన నష్టాన్ని టెరాసాఫ్ట్‌ సంస్థ వివరించింది. మొత్తం ఖర్చులో 117 కోట్లు సిస్కో లేదా ఆల్టీస్‌కు, 70 కోట్లు ఫైబర్‌కు, 100 కోట్లు టెక్నాలజీ సెంటర్లయిన విశాఖపట్నంలోని నెట్‌వర్క్‌ ఆపరేటింగ్‌ సెంటర్, 13 జిల్లా కేంద్రాల ఆపరేషన్‌ సెంటర్లు, 670 మండల కేంద్రాల్లో ఆపరేషన్‌ సెంటర్లు, 2వేల 4 వందల 45 సబ్‌ స్టేషన్‌లలో పీవోపీ, ఇతర ఖర్చులకు వెచ్చించారు. దీనిలో వందల కోట్ల కుంభకోణానికి ఆస్కారం ఉందా.. చేసిన పనిని పేరొందిన సంస్థతో మదింపు చేయిస్తే విలువ తెలుస్తుంది కదా ఎందుకు చేయలేదని నిలదీసింది.

ప్రపంచ ప్రఖ్యాత సిస్కో, పోర్చుగల్‌ ప్రభుత్వానికి చెందిన ఆల్టీస్‌ సంస్థల పరికరాలను టెరాసాఫ్ట్‌ ఏర్పాటు చేసిందని తెలిపింది. టెండరు నిబంధనలకు అనుగుణంగానే సరఫరా చేసిందని వీటిని ఫాస్ట్‌లేన్‌ సంస్థ ద్వారా తీసుకుని ఎస్క్రో ఖాతా ద్వారా సిస్కో/ఆల్టీస్‌లకు చెల్లించారని వివరించింది. ఫాస్ట్‌లేన్‌కు 117 కోట్ల సరఫరాపై 2 శాతం కమీషన్‌గా 2 కోట్ల 34 లక్షలు అందిందని తెలిపింది.

Pattabi: 'ప్రజల దృష్టి మళ్లించేందుకే ఫైబర్ నెట్ అవినీతి ఆరోపణలు'

అయితే ఫాస్ట్‌లేన్‌ సిబ్బంది అనేక మందిని అరెస్టు చేసి.. చంద్రబాబుకు డబ్బులు వెళ్లాయని చెప్పాలంటూ బలవంతం చేశారని మండిపడింది.. దీనిపై ఆ సంస్థ హైకోర్టులో వేసిన కేసు పెండింగ్‌లో ఉందని ఫాస్ట్‌లేన్‌ సంస్థ ఖాతాలన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన రాష్ట్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ ఏ అవకతవకలూ లేవని తేల్చిందని వెల్లడించింది.

జెమిని కమ్యూనికేషన్స్‌ సంస్థ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీగా 13 కోట్ల 50 లక్షలకు కాంట్రాక్టు పొందిందని తెలిపింది. అది చెన్నైకు చెందిన సంస్థ కాబట్టి.. ఓ మానవ వనరుల సంస్థకు కాంట్రాక్టుకి ఇచ్చి మనుషులను తీసుకుందని చెప్పింది. నెట్‌ఆప్స్‌కు 3 కోట్ల 15 లక్షల విలువైన కాంట్రాక్టు ఇవ్వగా.. వారికి 65 లక్షల లాభం వచ్చిందని వెల్లడించింది. దానిపై ఆ సంస్థ పన్నులు చెల్లించిందని రాష్ట్ర డీఆర్‌ఐ ఆ ఖాతాలన్నీ పరిశీలించి తప్పేమి జరగలేదని నిర్ధారించిందని వివరించింది.

జెమిని సంస్థకు చెందిన వారిని అరెస్టు చేసి చంద్రబాబుకు డబ్బులిచ్చామని చెప్పాలంటూ తీవ్రంగా వేధించారని ధ్వజమెత్తింది. దీంతో వారు తమకు రావాల్సిన బిల్లులు వదులుకొని సంస్థ మూసుకున్నారని తెలిపింది. ఫాస్ట్‌లేన్‌కు వచ్చిన కమీషన్‌ 2 కోట్ల 34 లక్షలని తెలిపింది. చంద్రబాబు పేరు చెప్పాలంటూ తమను హింసిస్తున్నారని ఆ సంస్థ కూడా హైకోర్టులో కేసు వేసినట్లు తెలిపింది. లేబర్‌ సరఫరా కాంట్రాక్టు చేసి 65 లక్షల రూపాయలు సంపాదిస్తే.. వారిని చంద్రబాబుకు అంటగట్టి ప్రచారమా, అరాచకాలకు హద్దులు లేవా అని మండిపడింది.

'జగన్‌ తన అవినీతి బురదను లోకేశ్‌కు అంటించాలని చూస్తున్నారు'

321 కోట్ల రూపాయల కాంట్రాక్టును అధికారుల కమిటీ టెండర్లు పిలిచి ఖరారు చేసిందని తెలిపింది.. సంస్థ ఎండీని అరెస్టు చేసి జైల్లో పెడితే అవకతవకలకు ఆధారాలు లేవని కోర్టు బెయిలు మంజూరు చేసిందని వివరించింది. చంద్రబాబు పేరు చెప్పాలంటూ తమపై ఒత్తిడి చేస్తున్నారని సరఫరాదారులు హైకోర్టుకు వెళ్లారంది. 2 వేల 4 వందల కిలోమీటర్ల ఫైబర్‌ కేబుల్‌ వేసిన 117 కోట్ల పరికరాలు, ఆపరేషన్‌ సెంటర్లు అన్నీ మీ ముందున్నాయని తెలిపింది.

నెలకు 20 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తోందని ఇంకా కుంభకోణం అనటానికి అర్థంలేదని తెలిపింది. 2020లో సీబీఐ విచారణకు ఇచ్చామన్నారని 2021లో విజిలెన్స్‌ నివేదిక వచ్చిందన్నారంది. 2021లోనే సీఐడీ విచారణ మొదలుపెట్టిందని రాష్ట్ర డీఆర్‌ఐ అధికారులు ప్రతి ఓచరూ వెతికారంది. రెండేళ్లవుతున్నా ఒక్క రూపాయి కూడా ఎవరికి వెళ్లిందో చెప్పే ఆధారాలే లేవని తెలిపింది. గవర్నర్‌ అనుమతి లేదని.. అయినా చంద్రబాబును ఎలాగైనా జైల్లోనే కొనసాగించాలని మళ్లీ పీటీ వారెంట్‌ దాఖలు చేశారంది. ఇది రాజకీయ కక్షకు పరాకాష్ఠని దీనికి ప్రజలే సమాధానం చెబుతారని తెలుగుదేశం తెలిపింది.

ఏపీ ఫైబర్ గ్రిడ్ వ్వవస్థను రాష్ట్రపతే మెచ్చుకున్నారు: లోకేశ్

ABOUT THE AUTHOR

...view details