TDP Contest in 2024 Rajya Sabha Election :రాజ్యసభ ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలపాలని తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తోంది. ఒక స్థానానికి పోటీ చేస్తే రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలు తమకు అనుకూలిస్తాయా ? లేదా అనే విషయాలను కూలంకషంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పోటీకి అధిష్ఠానం సరే అంటే పోటీలో నిలిచేందుకు తాము సిద్ధమని ఇద్దరు నేతలు ముందుకు వచ్చినట్లు సమాచారం. నిజానికి రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి అవసరమైన బలం తెలుగుదేశానికి లేదు.
అధికార పార్టీపై ఉన్న ఆక్రోశం టీడీపీకి కలిసొస్తుందా? :వైఎస్సార్సీపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేల నుంచే రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీకి దించాలనే ఒత్తిడి పెరుగుతోంది. దీనిపై టీడీపీ అధిష్ఠానం ఆలోచన చేస్తోంది. సంక్రాంతి తురువాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నవారిలో వైఎస్సార్సీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ నుంచి సీఎం రమేశ్, టీడీపీ నుంచి కనకమేడల రవీంద్ర కుమార్ పదవీ కాలం ఏప్రిల్‌లో ముగియనుంది. ఈ స్థానాలకు మార్చిలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
రాజ్యసభ ఎన్నికలు: సీఎం జగన్ మదిలో ఉన్న ఆ నలుగురెవరు?
టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు :టీడీపీ ఎమ్మెల్యేలు 23 మంది ఉన్నారు. వీరిలో విశాఖ దక్షిణ శాసనసభ్యుడు వాసుపల్లి గణేశ్, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గుంటూరు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, వైఎస్సార్సీపీలో చేరారు. అధికార పార్టీ నుంచి నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కూడా టీడీపీకి మద్దతు ఇస్తున్నారు. దీంతో టీడీపీ సంఖ్యాబలం 23 అవుతుంది. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాలంటే ఈ బలం సరిపోదు.