TDP Complaint to CEC Against Bogus Votes: దిల్లీలో ఈసీ అధికారులతో అచ్చెన్నాయుడు నేతృత్వంలో టీడీపీ నేతలు కనకమేడల రవీంద్రకుమార్, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బొండా ఉమ సమావేశమయ్యారు. ఓట్ల తొలగింపు, చేర్పు ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలను ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల అధికారులను కలిసిన అనంతరం.. టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకువచ్చామని తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లతో తప్పుడు ఓటర్ల జాబితా తయారుచేస్తున్నట్లు టీడీపీ నేతలు ఆరోపించారు.ఈసీ ఆదేశాలను రాష్ట్రంలోని అధికారులు పాటించట్లేదని టీడీపీ నేతలు తెలిపారు. గ్రామ సచివాలయ సిబ్బంది ప్రభుత్వ ప్రచారంలో పాల్గొంటున్నారని.. సచివాలయ సిబ్బందిని బీఎల్‌వోలుగా నియమిస్తున్నారని తెలిపారు. వైసీపీ జెండాలతో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. గ్రామ సచివాలయ సిబ్బందిని ఎన్నికలకు దూరంగా ఉంచాలని కోరినట్లు తెలిపారు. తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని ఈసీ అధికారులు చెప్పారని టీడీపీ నేతలు వెల్లడించారు.
No Action Against on Votes Deletion in AP: రాష్ట్రంలో ఓట్ల తొలగింపును ఈసీ ఎందుకు ఉపేక్షిస్తోంది..
ఎలాంటి చర్యలు తీసుకోలేదు: వాలంటీర్ వ్యవస్థ ద్వారాటీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఒక వ్యక్తికి రెండు ఓట్లున్న జాబితా ఆధారాలతో ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదనే విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. చనిపోయిన వ్యక్తుల ఓట్లు ఆధారాలతో ఇచ్చినా ఓట్లు తొలగించలేదని పేర్కొన్నారు. అక్టోబర్ 27 వరకు దేశవ్యాప్తంగా ఓటర్ల పరిశీలన కార్యక్రమం జరిగిందని వెల్లడించారు. కానీ, రాష్ట్రంలో మాత్రం ఓటర్ల పరిశీలన కార్యక్రమం జరగలేదని తెలిపారు. ఫారం 6, 7, 8 దరఖాస్తులపై రాష్ట్రంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ టీడీపీ నేతలు తెలిపారు. ఒక కుటుంబంలోని వ్యక్తుల ఓట్లను వేర్వేరు బూత్‌లకు కేటాయించారని టీడీపీ నేతలు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 160 పోలింగ్ కేంద్రాలు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆ పోలింగ్ కేంద్రాలపై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.