ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి: చంద్రబాబు

By

Published : Dec 15, 2022, 4:51 PM IST

CBN LETTER TO CS: మాండౌస్‌ తుపాను బాధిత రైతులను ఆదుకోవాలంటూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్​రెడ్డికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. భారీ వర్షాలతో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని.. వరి, అపరాలు, అరటి, బొప్పాయి, పొగాకు, శనగ, మిరప, పత్తి పంటలకు తీవ్ర నష్టం జరిగిందని గుర్తు చేశారు.

CBN LETTER TO CS JAWAHAR REDDY
CBN LETTER TO CS JAWAHAR REDDY

CBN LETTER TO CS JAWAHAR REDDY : మాండౌస్‌ తుపాను బాధిత రైతులను ఆదుకోవాలని, ధాన్యం రైతుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్​రెడ్డికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని లేఖలో తెలిపారు. తుపాను కారణంగా అనంతపురం, కడప, అన్నమయ్య, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వరి, అపరాలు, అరటి, బొప్పాయి, పొగాకు, మిరప, పత్తి పంటలకు తీవ్ర నష్టం జరిగిందని పేర్కొన్నారు.

ధాన్యం సేకరణ లక్ష్యంలో ప్రభుత్వం భారీగా కోత: తుపాను కారణంగా కోత కొచ్చిన వరి పంట నీటమునగడంతో పాటు ఆరబెట్టిన ధాన్యం తడిసిందన్నారు. ఈ తుపానుతో రైతులకు రూ.వేల కోట్ల నష్టం జరిగినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని చంద్రబాబు విమర్శించారు. ధాన్యం సేకరణ లక్ష్యంలో ప్రభుత్వం భారీగా కోత విధించిందని మండిపడ్డారు. ప్రభుత్వ ఆంక్షలు, కొత్త నిబంధనల కారణంగా పంటను సరైన ధరకు అమ్ముకునే పరిస్థితి లేక ధాన్యం రైతులు నానా యాతన పడుతున్నారన్నారు.

ధాన్యం ఆరబెట్టడానికి రైతులకు అదనపు ఖర్చు: ధాన్యంలో తేమ 17 శాతం కంటే అధికంగా ఉంటే మద్దతు ధరలో కోత కోస్తున్నారన్నారు. తేమ శాతం తగ్గించుకునేందుకు 20 రోజులు పైగా ధాన్యాన్ని రోడ్లపై, కళ్లాల్లో ఉంచాల్సి వస్తోందని పేర్కొన్నారు. ధాన్యం ఆరబెట్టడానికి బరకాలు, టార్పాలిన్లు, కూలీల ఖర్చు రైతుకు అదనపు భారంగా మారుతుందని తెలిపారు. ధాన్యం కొనుగోలుకు పరిమితులు విధించి.. దళారులకు అమ్ముకోవాలని ప్రభుత్వమే సూచించటం ఏంటని ప్రశ్నించారు. వరి రైతులను గోనె సంచుల కొరత వేధిస్తోందన్నారు. రాయితీపై రైతులకు అందించే టార్ఫాలిన్‌ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం గత మూడున్నర సంవత్సరాల నుంచి నిలిపివేసిందన్నారు.

తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రారంభించాలి: ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మొత్తం 1.25 లక్షల ఎకరాల్లో పొగాకు రైతులు నష్టపోయారని లేఖలో పేర్కొన్నారు. తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు వెంటనే అన్ని జిల్లాల్లో ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. తుపానుకు నష్టపోయిన వరి, అపరాలకు ఎకరానికి 20 వేలు, వాణిజ్య, ఉద్యాన పంటలకు ఎకరానికి 50 వేలు పరిహారం ఇవ్వాలని కోరారు. ఈ-క్రాప్‌ ఇతర నిబంధలు, ఆంక్షలు లేకుండా ఇన్యూరెన్స్‌ పరిహారం త్వరగా అందించాలన్నారు. కౌలు రైతులకు నేరుగా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ధాన్యం రైతులు పంట నూర్చిన వెంటనే అక్కడే కొనుగోలు చేసే విధానం తీసుకురావాలన్నారు. ధాన్యంలో తేమ శాతంతో సంబంధం లేకుండా పంట అంతా కొనుగోలు చెయ్యాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details