TDP Chargesheet on CM Jagan: సీఎం జగన్‌కు వివేకా హత్య విషయం ముందే తెలుసని సీబీఐ చెప్పాక కూడా, తన పదవికి రాజీనామా చేయకపోవడం అర్థరహితమని.. తెలుగుదేశం విమర్శించింది. సీబీఐ వచ్చి ఎప్పుడు ప్రశ్నిస్తుందో అనే అభద్రతాభావంలో జగన్ ఉన్నారని.. టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు నాలుగేళ్ల జగన్ పాలనపై ఛార్జి షీట్‌ను తెలుగుదేశం సీనియర్ నేతలు ఎన్టీఆర్ భవన్‌లో విడుదల చేశారు.
వివేకాహత్య జరిగాక తెల్లవారుజామునే.. జగన్, భారతిల పీఏల ఫోన్ల ద్వారా అవినాష్‌రెడ్డి మాట్లాడినట్లు రుజువైందని.. టీడీపీ నేతలు ఆరోపించారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని నమోదు చేయాలంటూ సీఐని అవినాశ్‌రెడ్డిని బెదిరించినట్లు రుజువైందని స్పష్టం చేశారు. అయినా అసెంబ్లీలోనే అవినాశ్‌రెడ్డికి సీఎం క్లీన్‌చిట్ ఇవ్వడం.. ఆయన్ను సమర్ధించడం కాదా..?అని నిలదీసింది. వెంటనే సీఎం పదవికి రాజీనామా చేసి.. జగన్ విచారణకు సహకరించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.
నాలుగేళ్లలో 6లక్షల కోట్లు అప్పు తెచ్చి.. 2లక్షల కోట్ల రూపాయలు మాత్రమే సంక్షేమ పథకాలకు ఖర్చు చేశారని.. తెలుగుదేశం తన ఛార్జిషీట్‌లో ప్రస్తావించింది. మిగిలిన 4లక్షల కోట్లు ఏం చేశారని ప్రశ్నించింది. ఇవి కాకుండా పెంచిన పన్నులు, ధరలు, ఛార్జీల ద్వారా వచ్చిన నిధులు ఎటు పోయాయని నిలదీసింది. జగన్ తన నాలుగేళ్ల పాలనలో ఒక్కో కుటుంబంపై 7 లక్షల 86 వేల 413 కోట్లు భారం మోపారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు.
జగన్ విధ్వంసకర పాలనతో 2లక్షల కోట్ల విలువైన అమరావతిని నిర్వీర్యం చేశారని నేతలు ఆక్షేపించారు. రాష్ట్ర జీవనాడైన పోలవరాన్ని అటకెక్కించటంతో పాటు 3వేల మంది రైతులపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిగ్గింగ్, కిడ్నాప్, ఆస్తుల ధ్వంసం, బలవంతపు ఏకగ్రీవాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అడ్డగోలు, అప్రజాస్వామిక నిర్ణయాల్ని, అసంబద్ధ ఉత్తర్వుల్ని రద్దు చేశారనే అక్కసుతో న్యాయవ్యవస్థపైనే దాడికి దిగారని.. టీడీపీ నేతలు మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థను ప్రైవేట్ సైన్యంలా మార్చుకుని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడేలా ప్రోత్సాహిస్తున్నారని విమర్శించారు. భూముల కోసం ఎయిడెడ్ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారని, కుల, మత, ప్రాంత, పార్టీల పేరిట విద్వేష రాజకీయాలు చేస్తూ.. 6లక్షల మందికి పింఛన్లు తొలగించారని ఆరోపించారు.
సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నిస్తూ పోస్ట్ పెడితే అక్రమ కేసులు పెడుతున్నారని, 73 మంది టీడీపీ కార్యకర్తలను అత్యంత కిరాతకంగా హత్య చేశారని మండిపడ్డారు. 60ఏళ్ల వృద్ధురాలు రంగనాయకమ్మపైనా అక్రమ కేసు బనాయించారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మాట తప్పి మడమ తిప్పిన హామీలుగా పది అంశాలను టీడీపీ ఛార్జిషీట్‌లో పేర్కొంది. మద్యనిషేధం, సీపీఎస్ రద్దు, ఇద్దరు పిల్లలకు అమ్మఒడి, 2.30లక్షల ఉద్యోగాల భర్తీ, మెగా డీఎస్సీ, అమరావతి రాజధాని అనే అంశాల్లో మడమ తిప్పిన జగన్‌కు సీఎంగా కొనసాగే అర్హత లేదని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు.
సీఎం జగన్‌పై తెలుగుదేశం ప్రజా ఛార్జిషీట్ ఇవీ చదవండి: