గుంటూరు జిల్లా గురజాల నగర పంచాయతీ నామినేషన్ల దాఖలు ఘట్టం శుక్రవారం సినీఫక్కీని తలపించింది. 1, 2 వార్డులకు తెదేపా తరఫున పోటీచేస్తున్న కాశవరపు వెంకటేష్, కత్తి జ్ఞానమ్మను హైకోర్టు ఆదేశాల మేరకు నామినేషన్ కేంద్రాలకు తీసుకురావటానికి ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉదయం 10.30 గంటలకు వారు గురజాల తహసీల్దారు కార్యాలయానికి చేరుకున్నారు. అదే సమయంలో జంగమహేశ్వరపురం నామినేషన్ కేంద్రానికి అధికార పార్టీకి చెందిన గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి వైకాపా అభ్యర్థులతో కలిసి ర్యాలీగా వెళుతున్నారని తెలిసి, ఆ కార్యక్రమం ముగిసేదాకా వారిని తహసీల్దారు కార్యాలయంలోనే ఉంచారు.
ఆ ఇద్దరూ పోలీసు రక్షణ మధ్య 12గంటల తర్వాత నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం వారిని తీసుకెళ్లి గురజాలలో వదిలారు. జంగమహేశ్వరపురం నామినేషన్ కేంద్రాల్లో ఉద్రిక్తత నెలకొంటుందని, నామినేషన్లు వేయడానికి వచ్చేవారికి అక్కడ రక్షణ లేదని ఈ ఇద్దరితో పాటు షేక్ నజీమూన్, షేక్ హమీద్ నామినేషన్ల స్వీకరణకు ముందే హైకోర్టును ఆశ్రయించారు. నామినేషన్ల చివరిరోజైన శుక్రవారం ఆయా నామినేషన్ల కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఉన్నా ఆశావహులకు బెదిరింపులు తప్పలేదు. జంగమహేశ్వరపురంలో ఓ నామినేషన్ కేంద్రం వద్దకు పెద్దసంఖ్యలో వైకాపా నాయకులు, కార్యకర్తలు చేరుకుని ఇతరులు ఎవరూ అటు రాకుండా అడ్డుకున్నా పోలీసులు వారిని పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి.