మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ... అమరావతిని మాత్రమే రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ 250 రోజులుగా రైతులు చేపట్టిన ఉద్యమానికి తెదేపా నేతలు సంఘీభావం తెలిపారు. గుంటూరు వసంతారాయపురంలో నిరసన దీక్ష చేపట్టారు. అమరావతిని మూడు ముక్కలు చేయడానికి వైకాపా ప్రభుత్వం నిర్ణయించిందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. ఆ ప్రాంత రైతులు గత 250 రోజులుగా ఉద్యమం చేస్తున్నా సర్కారులో ఎలాంటి చలనం లేకపోవడం బాధాకరమని నక్కా అన్నారు. స్వాతంత్య్రం కోసం ఉద్యమాలు జరిగాయని విన్నామని.. వైకాపా పాలనలో ఆ పోరాటాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు.
ఆంధ్రులకు న్యాయం.. రాజధానిగా అమరావతితోనే సాధ్యం: నక్కా - అమరావతి ఉద్యమానికి తెదేపా సంఘీభావం
అమరావతిని రాజధానిగా ప్రకటించాలని 250 రోజులుగా రైతులు చేపట్టిన ఉద్యమానికి తెదేపా నేతలు సంఘీభావం తెలుపుతూ ...గుంటూరు వసంతారాయపురంలో నిరసన దీక్ష చేపట్టారు. 250 రోజులుగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా రైతులు దీక్షలు చేస్తున్నారని, ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు కొనియాడారు.
ప్రస్తుత ప్రభుత్వం వ్యవస్థలన్నింటిని భ్రష్టు పట్టిస్తోందని.. అడ్డగోలు నిర్ణయాలతో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి విషయంలో భాజపా ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందన్నారు. 5 కోట్ల ఆంధ్రులకు న్యాయం జరగాలంటే అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్నారు. ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని మార్చుకోవాలని.. లేదంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆంద్రప్రదేశ్ భవిష్యత్తు, అభివృద్ధి పట్ల ఈమాత్రం అవగాహన లేని వ్యక్తి సీఎంగా ఉండటం... ఏపీ ప్రజలు చేసుకున్న దురదృష్టమని ఎమ్మెల్సీ రామకృష్ణ అన్నారు. గత 16 నెలలుగా వైకాపా పాలన చూస్తుంటే మాట తప్పడం, మడమ తిప్పడంలో దిట్టగా కనిపిస్తుందన్నారు. ఇటువంటి ప్రభుత్వం అమరావతి రైతులకు న్యాయం చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.