TDP workers stage protests across Andhra Pradesh: చంద్రబాబు అరెస్ట్‌పై ఆందోళన కార్యక్రమాలు... బాబు కోసం చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు TDP Activists Protest Across Andhra Pradesh: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఐదోరోజు నిర్వహించిన రిలే నిరాహార దీక్షలలో భారీగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబు కోసం మేము సైతం అంటూ నినదించారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని, ఆయన ఆరోగ్యం బాగుండాలని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తమ అధినేతను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాపట్లలో టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జి నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. తెలుగుదేశం కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలు బయటకు రాకుండా పోలీసులు ప్రధాన గేటుకు గడియ పెట్టారు. దీంతో టీడీపీ నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది.
తిరుపతి జిల్లా: చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ తిరుపతి జిల్లా చంద్రగిరిలో టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పులివర్తి నాని ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబును విడుదల చేసేంత వరకు నిరసనలు కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.
కాకినాడ జిల్లా: చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ.... కాకినాడలో తెలుగు మహిళలు కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబును విడుదల చేసేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.
వైఎస్ఆర్ కడప జిల్లా: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పీఎన్ఆర్ ఫంక్షన్ హాలు వద్ద టీడీపీ నేత సురేష్ నాయుడు ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. చంద్రబాబును విడుదల చేసే వరకూ పోరాటం ఆగదని సురేష్ నాయుడు తేల్చి చెప్పారు. మైదుకూరులో తెలుగుదేశం నాయకులు చేపట్టిన రిలే దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి. బ్రహ్మంగారిమఠం మండల నాయకుడు దీక్షలో పాల్గొన్నారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గుంటూరు జిల్లా: తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదర చూసి ఓర్వలేక చంద్రబాబును అక్రమ అరెస్టు చేశారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. గుంటూరు జిల్లా పొన్నూరులో నిర్వహించిన రిలే నిరాహారలో టీడీపీ నేతలు, ధూళిపాళ్ల నరేంద్ర, కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. తెలుగుదేశం కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలు బయటకు రాకుండా పోలీసులు ప్రధాన గేటుకు గడియ పెట్టారు. దీంతో టీడీపీ నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. చంద్రబాబు అక్రమ అరెస్టు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తున్నారని నేతలు అన్నారు.
చర్చిల్లో ప్రత్యేక ప్రార్ధనలు:
ఏలూరు జిల్లా: భీమడోలులోని ఆర్సీఎం చర్చిలో టీడీపీ నేత గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. 100 కొబ్బరికాయలు కొట్టి దేవున్ని ప్రార్థించారు. చంద్రబాబు తర్వగా విడుదల కావాలని యేసుప్రభును వేడుకున్నారు. చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కొలేక అక్రమ కేసు పెట్టి ఇరికించారని గన్ని వీరాంజనేయులు ఆరోపించారు. చంద్రబాబు కోసం విజయనగరం జిల్లా చీపురుపల్లి ఆంధ్ర బాపిస్ట్ చర్చిలో టీడీపీ నేత కిమిడి నాగార్జున ఆధ్వర్యంలో ప్రార్థనలు జరిగాయి. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నాయకులు పాల్గొని చంద్రబాబు త్వరగా విడుదల కావాలని దేవున్ని ప్రార్థించారు.
నంద్యాల జిల్లా: చంద్రబాబు కోసం నంద్యాలలోని సెయింట్ పీటర్స్ చర్చిలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రార్థనలు చేశారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని, ఆరోగ్యంగా ఉండాలని దేవున్ని ప్రార్థించారు. చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ అనంతపురం జిల్లా ఉరవకొండలో ఐదోరోజు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. దీక్షలో బెలుగుప్ప మండల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సైకో పోవాలి-సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. వెంటనే చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని చర్చిలలో టీడీపీ శ్రేణులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లా: చంద్రబాబు తర్వగా విడుదల కావాలని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మాజీ ఎమ్మెల్యే రమణమూర్తి ఆధ్వర్యంలో చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణస్వామి దేవాలయానికి సర్పంచ్ చేపట్టిన పాదయాత్రను రమణమూర్తి ప్రారంభించారు. వెంటనే చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్ చేశారు.