కరోనాతో కుదేలై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నగర, పట్టణ వాసులపై ఆస్తిపన్ను రూపంలో పన్నుల వడ్డనకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 10వ తేది నుంచి ఆస్తిపన్ను పెంపుదలకు సంబంధించి కార్యాచరణ ఇప్పటికే మొదలైంది. దీంతో వచ్చే ఏప్రిల్ 1 నుంచి ఆస్తిపన్నుతోపాటు ఖాళీస్థలాలు, తాగునీటి పన్నులు ఇక ప్రియం కానున్నాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల నుంచి వివరాలు సేకరించి వాటికి అనుగుణంగా ఎవరిపై ఎంత భారం మోపవచ్చనే ఆలోచనకు ఇప్పటికే పురపాలక సంఘాలు ఓ అంచనాకు వచ్చాయి. గుంటూరు జిల్లాలో గుంటూరు నగరంతోపాటు 12 పట్టణాల్లో 3,91,572 అసెస్‌మెంట్లు ఉండగా... వాటి నుంచి ఆస్తిపన్ను రూపంలో ప్రస్తుతం రూ.190.22 కోట్ల ఆదాయం లభిస్తుంది. సగటున 15 శాతం పెంపుదల ఉంటే జిల్లాలోని పట్టణ వాసులపై దాదాపు రూ.28.53 కోట్ల భారం పడునుంది.
పన్నులు ఎక్కడ ఎలాా..?
* కొత్తగా నగర పంచాయతీలైన దాచేపల్లి, గురజాల వాసులు ఈ పన్నుల భారం తప్పదు. నూతన పన్ను విధానంలోకి వారు రాబోతుండటంతో మొన్నటివరకు పదులు, వందల్లో ఉన్న ఆస్తిపన్ను ఇక నుంచి రూ.వేలల్లో ఉండనుంది.
* 2002 సంవత్సరం నుంచి నివాసగృహాలు.. 2007 నుంచి వాణిజ్య భవనాలకు పన్నుల పెంపుదలలో ఎలాంటి మార్పు ఉండదు. గతంలో ఐదేళ్లకు ఒకసారి రివిజన్ పేరిట పన్నులు పెంచేవారు. ఇక నుంచి ఏటా పన్నులు పెంచుకునే అవకాశాన్ని పురపాలక సంఘాలకు ప్రభుత్వం కల్పించింది.
* నివాసగృహాలకు ఆస్తి విలువలో 0.10 శాతం నుంచి 0.20 శాతం.. నివాసేతర భవనాలకు 2 శాతం పన్నుభారం పడబోతుంది. ఆస్తి విలువ రూ.2 లక్షలు ఉంటే పన్ను రూ.40 వేలు వరకు చెల్లించాల్సి రావచ్చు.