రాజధాని మార్చేస్తున్నారని.. రాజధాని ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని పవన్ కళ్యాణ్ జ్ఞానం లేని మాటలు మాట్లాడుతున్నారని శ్రీదేవి మండిపడ్డారు. ప్రశ్నించేందుకు పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్.. పేదలకు, దళితులకు, సామాన్యులకు అండగా ఉన్న వైకాపాను మాత్రమే ప్రశ్నిస్తున్నారని.. పేద రైతుల భూములు కాజేసిన చంద్రబాబును మాత్రం ప్రశ్నించడం లేదన్నారు. రాజధాని మారడం లేదని కేవలం అభివృద్ధి వికేంద్రీకరణ దృష్ట్యా మాత్రమే మూడు ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారన్నారు. పవన్ రైతులను, జనసేన కార్యకర్తలను కూడా మోసం చేస్తున్నారన్నారు.
చంద్రబాబు వదిలిపెట్టిన పనులు పూర్తి చేయాలంటే లక్షల కోట్లు అప్పు చేయాల్సి వస్తుందని.. రాజధాని రైతులకు సీఎం న్యాయం చేస్తుంటే రైతులను రెచ్చగొట్టడం సరికాదని చెప్పుకొచ్చారు. సీఎం వైఎస్ జగన్ అడగకుండానే రైతులకు కౌలు 15 ఏళ్లు పెంచారని.. కూలీలకు రూ.2,500 నుంచి రూ.5,000 వరకు పరిహారం పెంచారన్నారు. సీఎం నిర్ణయానికి హర్షించాల్సింది పోయి చంద్రబాబు, లోకేశ్‌లు చెప్పినట్లు పవన్ మాట్లాడటం సరికాదన్నారు. సుమారు 4500 ఎకరాల భూములు బినామీల పేరుతో, తెల్ల రేషన్‌కార్డు దారులతో కొనుగోలు చేయించారని ఆరోపించారు. ఎస్సీల భూములను చంద్రబాబు కాజేస్తే..ఆ భూములు తిరిగి ఎస్సీలకు సీఎం వైఎస్ జగన్ ఇప్పించారని.. ఈ విషయాలపై పవన్ ఎందుకు మాట్లాడటం లేదన్నారు.