ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతి పిటిషన్లు 'నాట్‌ బిఫోర్‌ మీ'.. మరో ధర్మాసనానికి పంపాలన్న సీజేఐ - పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

supreme court enquiry on Amaravati farmers petition
supreme court enquiry on Amaravati farmers petition

By

Published : Nov 1, 2022, 12:27 PM IST

Updated : Nov 1, 2022, 7:59 PM IST

12:22 November 01

తాను సభ్యుడిగా లేని మరో ధర్మాసనానికి పంపాలని సీజేఐ జస్టిస్‌ యు.యు.లలిత్‌ ఆదేశం

అమరావతి పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

SC ENQUIRY ON AMARAVATI PETITIONS : రాజధాని అమరావతికి సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ కొత్త మలుపు తిరిగింది. పిటిషన్లను విచారించాల్సిన త్రిసభ్య ధర్మానసంలో ఉన్న సీజేఐ యుయు లలిత్‌.. నాట్‌ బిఫోర్‌ మీ అనడంతో.. అవి మరో బెంచ్‌ ముందుకు వెళ్లనున్నాయి. గతంలో సీనియర్‌ న్యాయవాదిగా ఉన్నప్పుడు.. రాష్ట్రానికి సంబంధించిన అనేక కీలక అంశాల్లో యుయు లలిత్‌ న్యాయ సలహాలు ఇచ్చిన విషయాన్ని రైతుల న్యాయవాది ప్రస్తావించడంతో ఆయన విచారణ నుంచి తప్పుకున్నారు. కొత్త సీజేఐ మరో వారంలో రానుండటంతో.. ఆ తర్వాతే అమరావతిపై దాఖలైన పిటిషన్ల విచారణ జరిగే అవకాశం ఉంది.

రాజధాని అమరావతిపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ కొత్త మలుపు తిరిగింది. త్రిసభ్య ధర్మాసనం లోని జస్టిస్ రవీంద్ర కోర్టుకు హాజరుకాలేదు. షెడ్యూల్ ప్రకారం విచారణ మొదలవగానే... ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత్​కు.. రైతుల తరఫున న్యాయవాదులు ఓ నోట్ అందజేశారు. గతంలో సీఆర్డీఏ చట్టం రూపకల్పనతో పాటు.. ఇతర అంశాలకు సంబంధించి జస్టిస్ యుయు లలిత్‌ న్యాయ సలహాలు ఇచ్చారని అందులో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన, ఆ తర్వాత నూతన రాజధాని విషయంలో అభిప్రాయం ఇచ్చిన విషయాన్ని జస్టిస్ లలిత్ దృష్టికి తీసుకెళ్లారు.

గతంలో జగన్ మోహన్ రెడ్డి ప్రతివాదిగా ఉన్న ఓ కేసు విచారణ నుంచి జస్టిస్ లలిత్ తప్పుకొన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఇప్పుడు దాఖలైన రాజధాని పిటిషన్లలోనూ జగన్ ఒక ప్రతివాదిగా ఉన్నట్లు తెలియజేశారు. ఈ నోట్​ను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత్... ఆ విషయం తనకు తెలియదన్నారు. గతంలో జరిగిన విషయాలను తమ దృష్టికి తీసుకొస్తున్నామని... విచారణ ప్రారంభిస్తే వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని రైతుల తరఫు న్యాయవాదులు నివేదించారు. ఈ సమయంలో "నాట్ బిఫోర్ మీ" అని చెబుతూ.. తాను సభ్యుడిగా లేని మరో బెంచ్ ముందుకు పిటిషన్ పంపాలని సీజేఐ జస్టిస్ యుయు లలిత్‌ ఆదేశించారు. మరో తేదీ ఇవ్వాలని న్యాయవాదులు కోరగా.. తాను విచారణ చేసేందుకు సిద్ధంగా లేనప్పుడు తేదీ ఇవ్వడం మంచిది కాదన్నారు. ఈ మేరకు రిజిస్ట్రీకి సూచనలు చేశారు.

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును... సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు.. శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని.. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని హైకోర్టు సూచించడం శాసనసభ అధికారాలను ప్రశ్నించడమేనని పిటిషన్​లో తెలిపింది.

6 నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అయితే... ప్రభుత్వం పిటిషన్ వేయడానికి ముందే... ఈ కేసుకు సంబంధించి ఎవరు కోర్టుకు వచ్చినా... తమ వాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలంటూ రాజధాని పరిరక్షణ సమితి నేతలు, రైతులు కేవియెట్ పిటిషన్లు దాఖలు చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పులో కొన్ని ప్రధాన అంశాలపై స్పష్టత లేదని కూడా పలువురు రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తీర్పులో ప్రస్తావించిన అంశాలతోపాటు తాము లేవనెత్తిన విషయాలు కూడా పొందుపరిచేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రభుత్వం, రైతులు దాఖలు చేసిన పిటిషన్ లను వేర్వేరుగా కేసుల జాబితాలో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ చేర్చారు.

ఈ పిటిషన్లను విచారించాల్సిన ధర్మాసనంలో ఉన్న సీజీఐ యు.యు.లలిత్‌ నాట్‌ బిఫోర్‌ మీ అనడంతో.. ఈ పిటిషన్లు మరో బెంచ్‌ ముందుకు వెళ్లనున్నాయి. సుప్రీంకోర్టుకు మరో వారంలో కొత్త సీజేఐ రానున్న తరుణంలో... ఆ తర్వాతే అమరావతి అంశంపై దాఖలైన వివిధ పిటిషన్లు విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది.

ఇవీ చదవండి:

Last Updated : Nov 1, 2022, 7:59 PM IST

ABOUT THE AUTHOR

...view details