గుంటూరు జిల్లా మిరప పంటకు ప్రసిద్ధి. అంతర్జాతీయంగా.. ఇక్కడ పండించే మిర్చికి గిరాకీ ఎక్కువ. ఇక్కడి మార్కెట్ నుంచి 30 దేశాలకు పైగా మిరప ఎగుమతులు జరుగుతుంటాయి. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి రైతులు మిరప పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే మిరపసాగు, కోతలు, ఆరబెట్టడంలో అనేక సమస్యలు రైతులు ఎదుర్కొంటున్నారు. కోతలు కోసే సమయంలో కూలీల చేతులు మంట పుట్టడం... కోత తర్వాత మిర్చిని ఆరబెట్టడం.. ఆ సమయంలో వర్షం నుంచి పంటను రక్షించుకోవటం వంటి సమస్యలు రైతులకు ఇబ్బందిగా మారాయి. వీటన్నింటికి పరిష్కారంగా ఏదైనా చేయాలని గుంటూరు జిల్లా వింజనంపాడులోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఆలోచించారు.
క్షేత్రస్థాయిలో పర్యటించి..
ఒక్కొక్కరు కాకుండా 12 మంది విద్యార్థులు కలిసి తమ తమ ఆలోచనల్ని పంచుకున్నారు. క్షేత్ర స్థాయిలో వెళ్లి రైతులు, కూలీలతో మాట్లాడారు. వారు ఎదుర్కొనే ఇబ్బందులు... ఏం చేస్తే వాటికి పరిష్కారం లభిస్తుందనేదానిపై విస్తృతంగా చర్చించారు. ఆ తర్వాత వారికి ఉపయోగపడేలా రెండు పరికరాల్ని రూపొందించారు. మిర్చిని సులువుగా కోసేందుకు ప్రత్యేకంగా కోత యంత్రం, అలాగే పంటను ఆరబెట్టే సమయంలో వర్షం నుంచి కాపాడేందుకు మరో పరికరాన్ని తయారు చేశారు. తమ కుటుంబాల్లో అమ్మనాన్న పడే కష్టాలు చూసి రైతు బిడ్డలుగా ఈ పరికరాల తయారీకి ముందుకు వచ్చినట్లు విద్యార్థులు చెబుతున్నారు. మిరపకోత యంత్రం తయారీకి 10వేల రూపాయలు ఖర్చయింది. మొక్కకు వేలాడే కాయల్ని చేతులతో ముట్టుకోకుండా రైతులు కోసుకోవచ్చు. అలాగే కోసిన కాయల సేకరించేందుకు దానికే ఓ సంచి అమర్చారు. 5 నుంచి 10 కిలోల మిర్చిని ఇలా సేకరించవచ్చు.
పంటకు కవర్ల రక్షణ