కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలం గోవిందపల్లి గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి మనోజ్... చెట్టుపై నుంచి పడిన ఘటనలో అతని 2 చేతులు విరిగిపోయాయి. 4 రోజుల క్రితం తన గ్రామానికే చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కృష్ణుడు... మనోజ్‌ను పిలిపించుకున్నాడు. చెట్టు ఎక్కి చింతకాయలు కోయాలని కోరాడు. తన పూర్వపు గురువు కావడం వల్ల మనోజ్ ఆయన మాట కాదనలేక చెట్టు ఎక్కి చింతకాయలు కోయడం ప్రారంభించాడు. రెండు గంపల చింతకాయలు జమ చేశాడు.
ఆ తర్వాత చెట్టుపై నుంచి కిందకు దిగే సమయంలో ఎండు కొమ్మపై కాలు పెట్టడం వల్ల.. ఆ కొమ్మ విరిగి నేలపై పడ్డాడు. 15 అడుగుల పైనుంచి పడిన కారణంగా మనోజ్ 2 చేతులు విరిగాయి. ఆ ఉపాధ్యాయుడు మనోజ్‌ను.. నంద్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లి చేతులకు కట్టు కట్టించాడు. ప్రస్తుతం మనోజ్ 2 చేతులకు కట్లతో మంచాన పడ్డాడు. ఉపాధ్యాయుడి దురాశతో తమ కుమారుడు ఈ స్థితికి చేరుకున్నాడని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.