Statewide Movement of Municipal Workers: మున్సిపల్ కార్మికులు మరో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. జులై 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకుసిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలకు ప్రణాళికలు రచిస్తున్నారు. అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే చలో విజయవాడ నిర్వహిస్తామని మున్సిపల్ కార్మికులు తేల్చిచెబుతున్నారు. ఈ నెల ఆఖరు నుంచి జులై రెండో వారం వరకురాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సమావేశాలు, జిల్లా స్థాయి సదస్సులు నిర్వహించనున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని కోటి ఆశనతో జగన్కు ఓట్లు వేసి గెలిపించామని మున్సిపల్ కార్మికులు వాపోతున్నారు.
పారిశుద్ధ్య కార్మికలు సమస్యలు పరిష్కరించడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విఫలమయ్యింది. గతంలో టీడీపీ మున్సిపల్ కార్మికులను మోసగించిందని తాను అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తానని నమ్మబలికిన ముఖ్యమంత్రి జగన్ తమని నట్టేట ముంచాడని మున్సిపల్ కార్మికులు మండిపడుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 42 వేల మంది మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు ఉన్నారని వారి కోరికలను నెరవేర్చడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దారుణంగా విఫలమయ్యిందని ఆవేదన చెందుతున్నారు. చాలీ చాలని జీతాలతో పని చేస్తున్న తమకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల్లో కోత విధించడం అన్యామని మున్సిపల్ కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే నిత్యవసర సరుకుల ధరలు పెరిగి కుటుంబ పోషణ కష్టమవుతోందని సంక్షేమ పథకాల్లో కోత విధిస్తే ఎలా అని వాపోతున్నారు. తమది పేదల పక్షపాతి ప్రభుత్వం అని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ తమని ఆదుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని మున్సిపల్ కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎడాపెడా మోపుతున్న గ్యాస్, పెట్రోల్, డీజిల్, కరెంటు చార్జీల భారాలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలతో పాటు తామూ నలిగిపోతున్నట్లు మున్సిపల్ కార్మికులు వాపోతున్నారు. దీనికి తోడు పనిపై అధికారుల నుంచి ఒత్తిడి పెరిగిపోతోందని మున్సిపల్ కార్మికులు మొరపెట్టుకుంటున్నారు. చాలా చోట్ల కనీసం వారాంతపు సెలవులు మంజూరు చేయడంలేదని కార్మికులు, ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆప్కాస్ అమలులో పలు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నయని ఆ సమస్యలకు పైస్థాయి అధికారులు పరిష్కారం చూపాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
ఆరోగ్య పరమైన సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలని మున్సిపల్ కార్మికులు కోరుతున్నారు. తాము నిరంతరం ప్రమాదకరమైన ప్రదేశాల్లో విధులు నిర్వర్తిస్తుంటామని, నిరంతరం ఏదో చోట ప్రమాదానికి గురౌతుంటామని చెబుతున్నారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మున్సిపల్ కార్మికులు కోరుతున్నారు. తమ డిమాండ్లు పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చొరవ చూపాలని లేకపోతే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని మున్సిపల్ కార్మికులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.