State Wide Agitations on CBN Health: తెలుగుదేశం అధినేత ఆరోగ్యం మెరుగుపడాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశాయి. చంద్రబాబుకు మెరుగైన వైద్యం అందించాలని పార్టీనాయకులు డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ శ్రేణుల్లో ఆందోళన కొనసాగుతూనే ఉంది.
చంద్రబాబు ఆనారోగ్యం నుంచి కోలుకోవాలంటూ పల్నాడుజిల్లా నరసరావుపేట మండలం ఇస్సపాలెంలో టీడీపీ నాయకులు భారీ ఎత్తున పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో సైకో పోవాలి సైకిల్ రావాలంటూ నినాదాలు చేశారు. సత్తెనపల్లి రోడ్డులోని బైపాస్ రోడ్డు నుండి ఇస్సపాలెం శ్రీ మహాంకాళీ అమ్మవారి ఆలయం వరకూ పాదయాత్ర నిర్వహించారు. మహంకాళి అమ్మవారికి టీడీపీ నేతలు పూజలు చేశారు. ఆలయానికి పాదయాత్రగా వెళ్లి.. వెయ్యి టెంకాయలు కొట్టారు. నాదెండ్ల మండలం కనపర్రులోని.. బాలయేసు ఆలయంలో టీడీపీ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షుడు పూదోట సునీల్ ప్రధాన రహదారి నుంచి చర్చి వరకు మోకాళ్లపై నడిచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని ఆకాంక్షించారు.
అనకాపల్లి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి, పాయకరావుపేట చర్చిల్లో టీడీపీ నాయకులు.. మహిళలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇందిరా కాలనీలోని చర్చిలో నిర్వహించిన ప్రార్థనలో మహిళలు, కార్యకర్తలు పాల్గొని చంద్రబాబు క్షేమంగా ఉండాలని.. ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు. బాబుతో మేము అంటూ నినాదాలతో పరిసర ప్రాంతాలను మార్మోగించారు.