Education Migrants: రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత చదువులను గాలికొదిలేసింది. నాణ్యమైన విద్య లేకపోవడం, ప్రైవేటులో పీజీ కోర్సులకు బోధన రుసుముల చెల్లింపు నిలిపివేతతో.. కళాశాలల్లో చేరేవారే లేకుండా పోయారు. చదువు, వసతికి అయ్యే వ్యయాన్ని భరించలేక.. పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. పీజీ చదివే ఎస్టీ, ఎస్సీలకు బోధనా రుసుములు చెల్లించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తీసుకోవడం లేదు.
2022-23లో పీజీ కోర్సుల్లో 44వేల 463 సీట్లు ఉండగా.. కేవలం 16వేల 252 మంది మాత్రమే ప్రవేశాలు పొందారు. ఈ ఏడాది దరఖాస్తులు పెంచేందుకు సామాజిక మాధ్యమాల్లో ఉన్నత విద్యామండలితో పాటు వర్సిటీలు ప్రచారం చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు కోర్సులు మార్చాల్సిన వర్సిటీలు.. విద్యార్థులు చేరడం లేదని కొన్ని కోర్సులను మూసేస్తున్నాయి.
MBA, MCAల పరిస్థితి దారుణంగా తయారైంది. MBAలో సగం సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ఇక రాష్ట్రంలో ఎంటెక్ చదివేవారి కంటే.. విదేశాల్లో M.S.కు వెళ్తున్న వారే ఎక్కువ ఉన్నారు. ఎంటెక్‌కు బోధనా రుసుములు నిలిపివేయడం కూడా ప్రవేశాలపై ప్రభావం చూపింది. రాష్ట్రవ్యాప్తంగా ఏటా 5 వేల నుంచి 6 వేల మంది ఎంటెక్ ప్రవేశాలు పొందుతుండగా.. విదేశాలకు వెళ్లే వారి సంఖ్య 15 వేలకు పైగానే ఉంది.
ఎంటెక్ చేసే వారిలోనూ ఎక్కువ మంది డీమ్డ్, ప్రైవేటు వర్సిటీలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎంటెక్ చదివేవారు తగ్గిపోవడంతో బీటెక్‌లో అధ్యాపకుల సమస్య ఏర్పడింది. విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్‌తో కాలేజీలు సెక్షన్లు పెంచుతున్నా.. చదువులు చెప్పేవారు దొరకడం లేదు. కొన్ని కళాశాలలు బోధనను అవుట్ సోర్సింగ్‌కు ఇచ్చేస్తున్నాయి. కొన్నిచోట్ల ఆన్‌లైన్‌లో బోధన చేయిస్తున్నారు. ఎంటెక్, పీహెచ్‌డీ ఉన్నవారిని ప్రైవేటు వర్సిటీలు ఎక్కువ జీతాలకు తీసుకుంటున్నాయి.రాష్ట్రంలో బీఈడీ కోర్సులో చేరేవారే లేకుండా పోయారు. ఒకప్పుడు మన రాష్రంలో భారీ డిమాండ్ ఉన్న డీఈడీ, బీఈడీ కోర్సులు.. ఇప్పుడు అనామకంగా మారిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లయినా ఒక్క నియామక ప్రకటన విడుదల చేయలేదు. పని చేస్తున్న వారినే హేతుబద్ధీకరణతో మిగులుగా తేల్చింది. అంటే భవిష్యత్తులో నియామకాలు చేపట్టే పరిస్థితి కూడా లేదు. అలాంటప్పుడు ఉద్యోగాలు లేని ఉపాధ్యాయ కోర్సులు ఎందుకంటూ ఎవ్వరూ చేరడం లేదు.
చివరికి అస్సాం, ఒడిశా రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో కళాశాలలు నిర్వహిస్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా బీఈడీలో 37వేల 367 సీట్లు ఉంటే.. 3వేల 231 మాత్రమే భర్తీ అయ్యాయి. ఇక ప్రైవేటు డీఈడీ కళాశాలలు దాదాపుగా మూతపడ్డాయి. ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలల్లో మాత్రమే ప్రవేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఒకప్పుడు 745 డీఈడీ కళాశాలలు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 20కి పడిపోయింది. అందులో 14 ప్రభుత్వ కళాశాలలే.E.A.P. సెట్‌లో అత్యుత్తమ ర్యాంకులు వచ్చిన విద్యార్థులు.. రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. I.I.T, నీట్, ప్రైవేటు, డీమ్డ్ వర్సిటీల్లో ప్రవేశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. గతేడాది E.A.P. సెట్‌కు 3 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా.. ఈసారి ఇప్పటి వరకు 2.80 లక్షలు వచ్చాయి. ఈసారి తెలంగాణ ఎంసెట్‌కు మన రాష్ట్రానికి చెందిన 75 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు.
మన దగ్గర నాణ్యమైన విద్య అందకపోవడం, హైదరాబాద్ చుట్టూ మంచి ఇంజినీరింగ్ కళాశాలలు, అక్కడే ఉద్యోగాలు లభించే పరిస్థితి ఉండడంతో అటుగా వెళ్లిపోతున్నారు. E.A.P సెట్‌లో 100లోపు ర్యాంకులు సాధించిన వారిలో ఒకరిద్దరు మినహా మిగతావారు కళాశాలల్లో చేరేందుకు కనీసం ఐచ్ఛికాలు కూడా నమోదు చేసుకోవడం లేదు. 10 వేల ర్యాంకులు సాధిస్తున్న వారిలోనూ ఎక్కువ మంది విద్యార్థులు డీమ్డ్, ప్రైవేటు వర్సిటీలకు వెళ్లిపోతున్నారు. అలాగే సాధారణ డిగ్రీ ప్రవేశాలు భారీగా పడిపోతున్నాయి. గత రెండేళ్లల్లో డిగ్రీలో సరాసరిన 2.50 లక్షల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందగా.. ఈసారి 1.41 లక్షల మందే చేరారు.
2022-2023లో సీట్ల భర్తీ ఇలా..