ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాక్రీట్​ సంస్థ కాంట్రాక్ట్ రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇళ్ల నిర్మాణం జాప్యమవుతుందని లబ్ధిదారులు ఆవేదన - గుత్తేదారు సంస్థ

ROCKREET COMPANY CONTRACT CANCELLED: జగనన్న కాలనీల్లో 11 వందల కోట్ల విలువైన పేదల ఇళ్ల నిర్మాణాన్ని నిబంధనలను కాదని రాక్రీట్‌ సంస్థకు కట్టబెట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు నాలుక కరుచుకుంది. ఆ సంస్థ ఎంతకీ నిర్మాణాల వేగం పెంచకపోవడంతో.. చేసేదేమీ లేక కేటాయించిన ఇళ్లను రద్దు చేస్తోంది. ఆ బాధ్యతల్ని జిల్లాల్లో కొత్త గుత్తేదారు సంస్థలకు అప్పగిస్తోంది. ఇప్పటికే గుంటూరు, విశాఖలో కేటాయించిన 16 వేల 6 వందల గృహాలను రద్దు చేయగా.. మరికొన్ని జిల్లాల్లోనూ అదే దిశగా కదులుతున్నట్లు సమాచారం.

ROCKREET COMPANY CONTRACT CANCELLED
ROCKREET COMPANY CONTRACT CANCELLED

By

Published : Feb 18, 2023, 7:41 AM IST

రాక్రీట్​ సంస్థ కాంట్రాక్ట్ రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇళ్ల నిర్మాణం జాప్యమవుతుందని లబ్ధిదారులు ఆవేదన

ROCKREET COMPANY CONTRACT CANCELLED: జగనన్న కాలనీల్లో 11 వందల కోట్ల విలువైన పేదల ఇళ్ల నిర్మాణాన్ని నిబంధనలను కాదని రాక్రీట్‌ సంస్థకు కట్టబెట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు నాలుక కరుచుకుంది. ఆ సంస్థ ఎంతకీ నిర్మాణాల వేగం పెంచకపోవడంతో.. చేసేదేమీ లేక కేటాయించిన ఇళ్లను రద్దు చేస్తోంది. ఆ బాధ్యతల్ని జిల్లాల్లో కొత్త గుత్తేదారు సంస్థలకు అప్పగిస్తోంది. ఇప్పటికే గుంటూరు, విశాఖలో కేటాయించిన 16 వేల 6 వందల గృహాలను రద్దు చేయగా.. మరికొన్ని జిల్లాల్లోనూ అదే దిశగా కదులుతున్నట్లు సమాచారం.

వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2020 సంవత్సరంలో మొదటి విడతగా 15 లక్షల 60 వేల గృహ నిర్మాణాలను చేపట్టింది. అందులో 3 లక్షల 15 వేల ఇళ్ల లబ్ధిదారుల్ని ప్రభుత్వమే కట్టించి ఇచ్చే గృహాలు కింద ఎంపిక చేసింది. వీరిని 30 మంది చొప్పున గ్రూపులుగా విభజించి.. స్థానికంగా ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చే మేస్త్రీలకు అప్పగించాలని మొదట్లో ప్రతిపాదించింది. ఇప్పుడు దాన్ని పక్కన బెట్టి పెద్ద మొత్తంలో ఇళ్ల నిర్మాణాన్ని గుత్తేదారు సంస్థలకు అప్పగించారు.

ఈ విషయంలోనూ గుత్తేదారు సంస్థలకు, లబ్ధిదారులకు మధ్య అధికారులే మధ్యవర్తిత్వం నడిపారు. 3 లక్షల 15 వేల గృహాల్లో 63 వేల ఇళ్లను.. వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి బంధువు, అనుచరవర్గం డైరెక్టర్లుగా ఉన్న గుత్తేదారు సంస్థ రాక్రీట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ అండ్‌ లాజిస్టిక్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు కేటాయించారు. అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్​, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్​, ఏలూరు, విజయనగరం, విశాఖ జిల్లాల్లో గృహ నిర్మాణ పనులు అప్పగించారు. 10 లక్షల రూపాయలకు మించిన పనులకు టెండరు విధానాన్ని పాటించాలని నిబంధనలు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. నిబంధనలకు తిలోదకాలిచ్చి యథేచ్ఛగా కట్టబెట్టేసింది.

రాష్ట్రంలోని పెద్ద లేఅవుట్లలో గుంటూరు జిల్లా పేరేచర్లలోని జగనన్న కాలనీ ఒకటి. ఇక్కడ 16 వేల మందికి ఇళ్ల పట్టాలిచ్చారు. ఫస్ట్​ స్టేజ్​లో సుమారు 10 వేల గృహాలు మంజూరు చేశారు. అందులో 9 వేల గృహాలను రాక్రీట్‌ సంస్థకే కట్టబెట్టారు. వీటిలో తాజాగా 3 వేల 6 వందల గృహాలను రద్దు చేసి....మరో నాలుగు సంస్థలకు అప్పగించారు. ఇదే జిల్లాలోని ఏటుకూరు జగనన్న కాలనీలో 9 వేల ఇళ్లను రాక్రీట్‌కు ఇవ్వగా.. వీటిలో 8వేల ఇళ్లను వెనక్కి తీసుకున్నారు.

విశాఖ జిల్లాలోనూ సుమారు 5వేల గృహాల్ని రద్దు చేసినట్లు సమాచారం. ఉమ్మడి అనంతపురం జిల్లా మినహా రాక్రీట్​ సంస్థ పనులు చేపడుతున్న మిగతా జిల్లాల్లో సైతం పనుల పురోగతి ఆశించిన స్థాయిలో లేదని అధికారులు గుర్తించారు. ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో.. ఇళ్ల నిర్మాణ వేగం పెంచాల్సిందేనని జిల్లా అధికారులు రాక్రీట్‌ ప్రతినిధులకు స్పష్టం చేస్తున్నారు. అయితే.. ఒత్తిడి చేస్తే పనులు చేపట్టకుండా వైదొలుగుతామని కొన్ని జిల్లాల్లో గుత్తేదారు సంస్థ ప్రతినిధులు బెదిరింపులకు దిగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ పరిస్థితుల్లో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. రాక్రీట్‌ సంస్థ చేపడుతున్న ఇళ్ల నిర్మాణానికి.. 2022 ఆగస్టు నాటికే 256 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇందులో సిమెంటుకు 73 కోట్ల రూపాయలు, ఇనుముకు 182 కోట్ల రూపాయలు అప్పట్లోనే చెల్లించారు. ఇప్పుడు ఈ డబ్బుల పరిస్థితి ఏంటన్నదే ప్రశ్నగా మిగిలింది. ముందు నిబంధనలకు వ్యతిరేకంగా కాంట్రాక్ట్ కట్టబెట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు రద్దు చేయడంతో ఇళ్ల నిర్మాణంలో తీవ్ర జాప్యం ఏర్పడుతోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details