Negligence of the State Government: రాజ్యాంగబద్ధంగా విడుదల చేయాల్సిన నిధుల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. 386 కోట్ల రూపాయలు విడుదల చేస్తే.. రానున్న నాలుగేళ్లలో ఆర్థిక సంఘం నుంచి 2 వేల కోట్ల రూపాయలు రానున్నాయి. అదనంగా రూపాయి కూడా రాష్ట్రం చెల్లించాల్సిన అవసరం లేదు. ఆర్థిక సంఘం పంపించిన నిధుల్లో మూడో వంతు వరకు ఇతర అవసరాలకు మళ్లించిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై కేంద్ర వర్గాలూ.. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో తొలిసారి కేంద్రం.. 15వ ఆర్థిక సంఘం కింద రాష్ట్రానికి 2021-22 నుంచి ఐదేళ్లకు కలిపి 2 వేల 500 కోట్లు ఇచ్చేందుకు ఆమోదించిందని దిల్లీ వర్గాలు తెలిపాయి. ఈ నిధులను స్థానిక సంస్థల ద్వారా.. పట్టణ లేదా గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు మెరుగుపర్చేందుకు వినియోగించాలి. వీటితో ప్రభుత్వాసుపత్రుల్లో రోగనిర్ధారణ పరీక్షల పరికరాలు, యంత్రాలను సమకూర్చాలి.
స్థానిక సంస్థలకు వీటి కొనుగోలు సౌలభ్యత లేనందున.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు కేంద్రం ఈ బాధ్యతలను అప్పగించింది. ఈ క్రమంలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 488 కోట్ల రూపాయలను.. కాస్త ఆలస్యంగా కేంద్రం విడుదల చేసింది. నిధులను.. ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్‌కూ వాడుకునే వీలుంది. రాజ్యాంగబద్ధంగా వచ్చే ఈ నిధులను ఇతర అవసరాలకు మళ్లించకూడదు.