R&B road renovation works: రాష్ట్రంలో 7వేల 500 కిలోమీటర్ల మేర అర్ అండ్ బీ రహదారుల పునరుద్ధరణ పనులు గత ఏడాది చేపట్టారు. వీటికి 2వేల 205 కోట్లు అవసరమని అంచనా వేయగా,...... దీనికి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 2వేల కోట్లు రుణంగా తీసుకున్నారు. పెట్రోల్, డీజిల్పై లీటరు రూపాయి చొప్పున వసూలు చేస్తున్న రహదారి అభివృద్ధి సెస్సు బ్యాంకు రుణానికి హామీగా చూపారు. గుత్తేదారులకు బ్యాంకు నుంచి నేరుగా చెల్లింపులు జరిపేలా ఏర్పాటు చేశారు. మిగిలిన 205 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా సమకూరుస్తామని మొదట్లోనే చెప్పింది. దీంతో బ్యాంకు ప్రతివారం రుణాన్ని విడుదల చేస్తూ వచ్చింది.
జిల్లాల వారీగా మొత్తం 1,162 రహదారుల పనులు చేపట్టగా, ఇందులో 1,070 పనులు పూర్తయ్యాయి. 2 వేల కోట్ల రూపాయల రుణంలో 1800కోట్ల రూపాయల వరకు గుత్తేదారులకు బ్యాంకు నుంచి చెల్లింపులు జరిగాయి. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద సమకూర్చాల్సిన 205 కోట్లు రూపాయలు మాత్రం ఇవ్వకుండా చేతులెత్తేసింది.రుణంలో 90 శాతం మేర గుత్తేదారులకు బ్యాంకు చెల్లించినా సరే... రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల కాలేదని బ్యాంక్ ఆఫ్ బరోడా ఉన్నతాధికారులు గుర్తించారు.