Govt paid crores to Hinduja: అసలు ఉత్పత్తే చేయని విద్యుత్తుకు.. ప్రభుత్వం నుంచి ఎవరైనా డబ్బులు తీసుకోగలరా? అది ఆంధ్రప్రదేశ్‌లోనే సాధ్యం. మన రాష్ట్ర ప్రభుత్వం అలా డబ్బులు ఇవ్వడానికి డిస్కంలతో అప్పులు చేయించి.. వాటికి హామీ ఇవ్వడమే కాక ఆ డబ్బును ఫలానా సంస్థకు ఇవ్వాలనీ చెబుతోంది. హిందుజా కంపెనీ విషయంలో ప్రభుత్వం చూపుతున్న అత్యుత్సాహానికి ప్రబల నిదర్శనమిది. ఫిబ్రవరి 16న ప్రభుత్వం జారీ చేసిన జీవో-19 సారాంశం ఇదే. హిందుజా సంస్థ నుంచి విద్యుత్తు తీసుకోవడానికి వీలుగా విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడంలో రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి- ఏపీఈఆర్సీ నిబంధనల మేరకు వ్యవహరించాలని చెప్పింది.
అవే ఉత్తర్వుల్లో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు.. పీఎఫ్సీ-ఆర్ఈసీ నుంచి 12 వందల 34.68 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవాలని.. ఆ రుణానికి ప్రభుత్వం హామీగా ఉంటుందని తెలిపింది. ఇలా తీసుకునే మొత్తాన్ని హిందుజా నేషనల్ పవర్ కంపెనీ లిమిటెడ్-హేచ్ఎన్పీసీసీఎల్కు చెల్లించాలని ప్రభుత్వమే చెప్పింది. దీనికి ఏపీఈఆర్సీ అనుమతి తీసుకోవాలని కూడా ప్రభుత్వం చెప్పలేదు. అసలు విద్యుత్తు ఉత్పత్తి చేయని కాలానికి హిందుజా సంస్థకు చెల్లింపులు చేయడంపై ఆర్థికశాఖ అభ్యంతరం తెలిపినా.. ఆ మొత్తాన్ని చెల్లించే విషయంలో ప్రభుత్వం ముందుకే వెళ్లింది. ఈ దస్త్రంపై సంతకాలు చేసిన అధికారులకు భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా మంత్రిమండలిలో ఆమోదం పొందేలా జాగ్రత్తలు తీసుకుని మరీ చెల్లించారు. మొదటి విడత 800 కోట్లు, రెండో విడత మిగిలిన మొత్తాన్ని పీఎఫ్సీ నుంచి రుణంగా తీసుకుని డిస్కంలు చెల్లించాయి. ఆ భారం ప్రజలపైనే పడనుంది.
కోర్టు ఆదేశాల్లేవు.. ఏపీఈఆర్‌సీ అనుమతీ లేదు..ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో.. హిందుజా సంస్థకు వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఎందుకు చెల్లిస్తున్నామనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. డిస్కంలు చెల్లించాల్సిన బకాయిల కింద ఈ మొత్తాన్ని చెల్లిస్తున్నామనే పేర్కొంది. ఆ బకాయిలు ఏంటి? ఎప్పటినుంచి చెల్లించాల్సి వస్తోందనే వివరాలేవీ చెప్పలేదు. ఎక్కడినుంచి రుణం తీసుకోవాలనే మార్గాన్నే ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ మేరకు లేట్ పేమెంట్ స్కీం కింద పీఎఫ్సీ నుంచి రుణాన్ని తీసుకుని.. డిస్కంలు హిందుజాకు చెల్లించాయి. ప్రభుత్వం ఇంత హడావుడిగా వేల కోట్ల రూపాయలు చెల్లించడానికి కోర్టు నుంచి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? పోనీ ఏపీఈఆర్సీ ఏమైనా సూచనలు చేసిందా? అవేమీ లేకుండానే విద్యుత్తు తీసుకోని కాలానికి స్థిర ఛార్జీల రూపేణా హిందూజ సంస్థకు ప్రభుత్వం హడావిడిగా చెల్లించింది. కనీసం ఏపీఈఆర్సీ అనుమతి కూడా తీసుకోలేదు.