NO FUNDS TO NEW CONSTRUCTIONS : సహజంగా కొత్త బడ్జెట్‌లో నిర్మాణాలు, ఆదాయాన్ని సృష్టించే కార్యక్రమాలకు మూలధన నిధులను అధికంగా ప్రతిపాదిస్తారు. ఈసారి జలవనరుల శాఖ ప్రాజెక్టులకు, సాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి ప్రాధాన్యం దక్కకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రాథమిక రంగాల్లో మాత్రమే మౌలిక సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇళ్లు, తాగునీరు, విద్య, ఆరోగ్యం, రోడ్లు, రవాణా వంటి అంశాలపైనే ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు పేర్కొంటున్నారు.
చాలినంత బడ్జెట్ కేటాయింపులు లేకపోతే! : మూలధన వ్యయం కేటాయింపుల సమయంలో వీటిపై దృష్టి సారించాలని చెబుతున్నారు. ఈ నిధులను ప్రత్యేకంగా మధ్య తరహా అభివృద్ధి పథకాలు, మిషన్ లక్ష్యాలు ఉన్న వాటికే కేటాయిస్తామన్నారు. ఈమేరకు రాష్ట్రంలోని చీఫ్ ఇంజినీర్లకు ఆన్‌లైన్‌లో ఒక ప్రొఫార్మా పంపారు. వారి శాఖల్లో ఉన్న పనులకు సంబంధించిన వివరాలను అందులో పొందుపరచాలని సూచించారు. ప్రొఫార్మాలో చేర్చిన పనులకు మాత్రమే నిధులు ఇస్తామని స్పష్టం చేశారు. చాలినంత బడ్జెట్ కేటాయింపులు లేకపోతే ఏ పనీ చేపట్టకూడదన్నారు.
కేంద్ర పథకాలపై నో ఆసక్తి: ఏపీలో కేంద్ర పథకాలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంతగా ఆసక్తి చూపడం లేదు. కేంద్రం కొంత మొత్తం వాటా ఇస్తే దీనికి అదనంగా రాష్ట్రం తనవంతు వాటా కేటాయించాలి. అందుకే ఆర్థిక శాఖ ముందస్తు అనుమతి లేకుండా బడ్జెట్‌లో కేంద్ర పథకాలకు ఎలాంటి ప్రతిపాదనలను చూపవద్దని స్పష్టం చేసింది. కేంద్ర పథకాల్లో రాష్ట్ర ప్రాధాన్య కార్యక్రమాలు ఉంటే వాటిని కొనసాగించే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ఈ పథకాలకు నిధులు చూపించే క్రమంలో ఊహాజనిత లెక్కలు వేయవద్దని గుర్తుచేసింది.
కేంద్ర పథకాలకు ఆగిపోయిన నిధులు: కిందటి ఏడాది కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయో అవే మొత్తాలు లేదా, సిద్ధమైన కార్యాచరణ ప్రణాళికలో పేర్కొన్న నిధులను పరిశీలించి.. ఏది తక్కువ ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకోవాలంది. ఇప్పటికే రాష్ట్ర వాటా నిధులు ఇవ్వనందున అనేక కేంద్ర పథకాలకు కేంద్ర నిధులు ఆగిపోయాయి. తాజా మార్గదర్శకాలను పరిశీలించినా ఇదే ఒరవడి కొనసాగనున్నట్లు అర్థమవుతోంది. కేంద్ర సాయంతో అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి ఉద్యోగులకు సైతం జీతాల కేటాయింపును చూపొద్దని ఆర్థికశాఖ ఆదేశించింది.
కొత్త పనులా.. నిధుల్లేవ్..! చర్చనీయాంశమవుతున్న బడ్జెట్ మార్గదర్శకాలు ఇవీ చదవండి: