శ్రీశైలం నుంచి పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ మరో రెండు రోజుల్లో నాగార్జునసాగర్(NagarjunaSagar) గేట్లను తాకనుంది. శ్రీశైలం నుంచి పది గేట్ల ద్వారా 3.76 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ జల విద్యుత్కేంద్రాల నుంచి కూడా నీరు విడుదలవుతోంది. మొత్తం కలిపి 4.34 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి జూరాల, తుంగభద్ర నదుల ద్వారా 5.37 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.
సాగర్‌లో 547 అడుగుల మేర నీరు..
సాగర్‌లో గురువారం సాయంత్రానికి మరో 107 టీఎంసీలు ఖాళీ ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 553.10 అడుగుల వద్ద ఉంది. సాగర్ వద్ద ఇన్‌ఫ్లో 2,77,640 క్యూసెక్కులు ఉండగా శ్రీశైలం నుంచి విడుదలవుతున్న భారీ వరద శుక్రవారం ఉదయంలోగా సాగర్ వెనుక జలాలను తాకనుంది. రోజుకు దాదాపు 37 టీఎంసీలకు పైగా నిల్వ పెరగనుండగా ఆదివారం నాటికి సాగర్ పూర్తి స్థాయి మట్టానికి (ఎఫ్‌ఆర్‌ఎల్) చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టు కింద ఉన్న సుమారు 20 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల ఎప్పుడోనని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. గతేడాది ఆగస్టు 11న ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయగా.. ఈ దఫా వారం ముందుగానే నీటిని విడుదల చేసే అవకాశముందని ఎన్‌ఎస్‌పీ అధికారులు వెల్లడించారు.