Spinning Mills in Crisis: రాష్ట్రంలో స్పిన్నింగ్ మిల్లులు సమస్యల సుడిగండంలో చిక్కుకున్నాయి. 2022 జనవరి వరకు మిల్లుల పరిస్థితి కొంత బాగానే ఉన్నప్పటికీ తర్వాత నుంచి కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికీ అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడ తయారైన దారం మొత్తాన్ని దేశీయంగా వినియోగించుకునే పరిస్థితి లేకపోవడంతో క్రమంగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం దూది నుంచి కిలో దారం తయారుచేస్తే సగటున 10 రూపాయలు నష్టం వస్తోంది. కొన్ని మిల్లుల్లో ఇది 15 రూపాయల వరకు ఉంది. మరోవైపు విద్యుత్ ఛార్జీలు పెరగడం, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు సకాలంలో అందకపోవడంతో మిల్లుల నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ పరిస్థితుల్లో కొందరు నడపడం కంటే మూసేయడం మేలని భావిస్తున్నారు. ఓవైపు ముడిసరకు, పత్తి ధరలు పెరగడం, మరోవైపు దారం ఎగుమతులు ఆగిపోయి నిల్వలు పేరుకుపోయి పరిశ్రమ కుదేలవుతోంది. స్పిన్నింగ్ మిల్లులు ఉత్పత్తి చేసిన దారాన్ని దేశీయంగా వినియోగించడంతోపాటు చైనాకు సుమారు 30 శాతం ఎగుమతులు జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం నేపథ్యంలో చైనా నుంచి ఇతర దేశాలకు రెడీమేడ్, గార్మెంట్స్ దుస్తులు తగ్గిపోయాయి. దీంతో చైనా మన దేశం నుంచి దారం కొనుగోళ్లను గణనీయంగా తగ్గించింది. దేశీయంగా కూడా వస్త్రానికి సరైన డిమాండ్ లేకపోవడంతో కొనుగోలు చేసేవారు కరవయ్యారు.
గత ఏడాది సీజన్ ప్రారంభమైన అక్టోబరు నెలలో క్యాండీ దూది ధర 85 వేలు ఉండగా క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం 57 వేలకు చేరుకుంది. నూలు మిల్లుల నిర్వాహకులు దూది కొన్న తర్వాత ధరలు తగ్గడంతో ఆ మేరకు నష్టపోయారు. స్పిన్నింగ్ మిల్లులు మూసేసినా 25వేల స్పిండిల్స్ సామర్ధ్యం ఉన్న పరిశ్రమకు యూనిట్ కు విద్యుత్ శాఖకు డిమాండ్ ఛార్జీల కింద 4.64 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది. 25వేల స్పిండిల్స్ ఉన్న చిన్న మిల్లుల వారు 50 శాతం సామర్థ్యంతో నడుపుతూ నెట్టుకొస్తున్నారు.