చిన్నప్పుడు చాలా మంది విద్యార్థులకు చదువంటే చిరాకు.. పాఠశాలకు వెళ్లాలంటే పెద్ద యుద్ధమే చేస్తారు. బడి చుట్టూ చెత్తాచెదారం, మురికినీరు ఉంటే.. చదవాలన్న కోరిక ఉన్నా వెళ్లాలనిపించదు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం బేతపూడిలోని ప్రభుత్వ పాఠశాల 2017 వరకు ఇలాగే ఉండేది. ఆ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు.. ప్రభుత్వం బాగు చేసే వరకు వేచి ఉండలేదు. తామే రంగంలోకి దిగి ఆ పాఠశాలను నందనవనంలా మార్చారు.
ఆయన కృషి ఎనలేనిది..
ఈ పాఠశాల అందంగా మారటం వెనుక.. ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ కృషి ఉంది. గతంలో నార్నేపాడు పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయునిగా రాష్ట్రపతి అవార్డు పొందిన శ్రీనివాస్.. 2017 ఆగస్టులో ప్రధానోపాధ్యాయునిగా ఇక్కడికి బదిలీపై వచ్చారు. విధులు ప్రారంభించిన వెంటనే పాఠశాల పరిశుభ్రతపై దృష్టి పెట్టారు. తల్లిదండ్రులు, గ్రామస్థులతో మాట్లాడి... పాఠశాలకు అవసరమైనవన్నీ సమకూర్చారు. దాదాపు నాలుగేళ్లు శ్రమించి.. విద్యార్థుల సహకారంతో.. పాఠశాలను బృందావనంగా మార్చారు.
చదువులమ్మకు పచ్చని తోరణం, నిత్య పుష్పమాలను ప్రకృతే స్వయంగా అందించేలా ప్రాంగణాన్ని మార్చారు. కూరగాయలు పెంచి.. అలా వచ్చిన ఆదాయాన్ని మళ్లీ పాఠశాలకే ఖర్చు చేస్తున్నారు. భూగర్భ జలాల పరిరక్షణకు ఈ పాఠశాల ఓ పెద్ద పాఠంలా మారింది. భూతాపాన్ని తగ్గించడమెలాగో ఇక్కడి వాతావరణం నేర్పుతుంది. ఉల్లాసంగా పనిచేసేందుకు ఈ వాతావరణం సహకరిస్తుందని ఉపాధ్యాయులు తెలిపారు.