రాష్ట్రంలో ఇప్పటివరకు అమల్లో ఉన్న విధానం ప్రకారం వ్యవసాయ విద్యుత్తు వినియోగానికి మీటర్లు లేవు. విద్యుత్తు విభాగం సబ్‌స్టేషన్ల వారీగా ఉన్న సాగు విద్యుత్తు కనెక్షన్ల వాడకాన్ని నమోదు చేసి ప్రభుత్వానికి పంపేది. ఉచిత వ్యవసాయ విద్యుత్తు పంపిణీ విధానంలో భాగంగా సంబంధిత మొత్తాన్ని ప్రభుత్వం విద్యుత్తు విభాగానికి చెల్లించేది. ఈ యావత్తు ప్రక్రియలో ఎక్కడా రైతుల ప్రమేయం ఉండేది కాదు. విద్యుత్తు విభాగ మూడో దశ సంస్కరణల్లో భాగంగా ప్రతి ఒక్కరు ఎంత విద్యుత్తును వినియోగిస్తున్నారో పక్కాగా లెక్క ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. సాగుకు ఉచిత విద్యుత్తు అందించే విధానాలు అమల్లో ఉంటే దాని కోసం డీబీటీ (డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్‌ఫర్) విధానంలో చెల్లింపులు చేయాలని స్పష్టం చేసింది. అంటే ఉదాహరణకు వంట గ్యాస్ రాయితీ వినియోగదారుల ఖాతాల్లో నేరుగా చేరుతున్నట్లన్నమాట. ఈ ఆదేశాల అమల్లో భాగంగా మన రాష్ట్రంలో వైఎస్‌ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్తు పథకంగా నామకరణం చేసి పక్కాగా లెక్క తీయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
రికార్డుల ఆధునికీకరణ
రాష్ట్రంలో సాగుకు ఉచిత విద్యుత్తు పథకాలు ఎప్పటి నుంచో అమల్లో ఉన్నాయి. ఆ పాత రికార్డులను ఆధునికీకరించి నూతన జాబితాలను సిద్ధం చేయడం ఈ పథకంలో తొలి దశ. గుంటూరు జిల్లాలో మొత్తం వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు 1,07,575 ఉన్నాయి. వీటిలో క్షేత్ర స్థాయిలో ప్రస్తుతం ఉన్న యజమాని పేరు, దస్త్రాల్లో ఉన్న పేర్లు ఒకటా, కాదా? అన్న అంశంపై క్షేత్ర స్థాయి పరిశీలన జరిపారు. విద్యుత్తు, వ్యవసాయ, రెవెన్యూ విభాగాల నుంచి సిబ్బంది క్షేత్ర స్థాయిలో పరిశీలించి తాజా రికార్డులను తయారు చేశారు. ఇందులో భాగంగా 1,04,614 మంది వివరాలను నమోదుచేశారు. అంటే 97.25 శాతం మంది రైతుల వివరాల క్రీడోకరణ పూర్తైంది. మిగిలిన వారిలో ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారు, అంతర్గతంగా భూ పంపిణీ వివాదాలున్న వారు, ఆస్తుల పంపకాలు పూర్తవని వారు, దేవదాయశాఖ పరిధిలోని భూములను సాగుచేస్తున్న వారున్నారు. ఈ 2,961 మంది రైతులకు సంబంధించి వారి, వారి వ్యక్తిగత ఆస్తి పంపకాలు పూర్తయిన తర్వాత, ఇతర అంశాల్లో ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి తదుపరి దశలో నిర్ణయం తీసుకోనున్నారు. మిగిలిన వారంతా ఉచిత విద్యుత్తు పథకంలో నమోదయ్యారు. గత రెండు నెలల నుంచి సాగుతున్న ఈ ప్రక్రియ తాజాగా పూర్తయింది.
గుత్తేదారు ద్వారా మీటర్ల ఏర్పాటు
ప్రతి సాగు కనెక్షన్‌కు విద్యుత్తు వినియోగ మీటర్లను బిగించడం మూడో దశ. ఈ కార్యక్రమాన్ని విద్యుత్తు విభాగం ఏజెన్సీలకు (గుత్తేదారులకు) అప్పగించనుంది. ప్రస్తుతం ఏజెన్సీల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. మొత్తం మీద అనేక అభ్యంతరాలు, విమర్శలను అధిగమించి సాగు విద్యుత్తుకు మీటర్లు బిగించే పని పట్టాలెక్కుతోంది. ప్రభుత్వం ఈ విధానం వల్ల రైతులకు మేలు జరుగుతుందని, వారి మీద ఎలాంటి భారం పడదని ఇప్పటికి ఒకటికి నాలుగు మార్లు ప్రకటించింది. నిజంగా అదే తీరులో తర్వాతి రోజుల్లోనూ సాగితే యావత్తు ప్రక్రియకు సార్ధకత చేకూరుతుంది.