ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసరావుపేటలో ఏం జరుగుతోంది... మిషన్- 15‌ అంటే ఏమిటి? - guntur district latest news

కేవలం లక్షా 20వేల జనాభా ఉన్న పట్టణం అది. కానీ కరోనా విజృంభణలో మాత్రం రాష్ట్రంలో అగ్రస్థానం వైపు దూసుకెళ్తోంది. 28 రోజుల్లోనే 164 కేసులు రావటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ క్రమంలో వైరస్ నియంత్రణ చర్యల కోసం మిషన్ మే-15 అమలు చేస్తామంటున్నారు అధికారులు. ఇంతకీ ఏమిటా మిషన్?... దాని లక్ష్యమేంటి? అనేవి ఆసక్తికర విషయాలు.

narasa rao peta
narasa rao peta

By

Published : May 6, 2020, 3:36 PM IST

Updated : May 6, 2020, 8:09 PM IST

గుంటూరు జిల్లా నర్సరావుపేటలో కరోనా కేసుల సంఖ్య 164కు చేరింది. ఇందులో వరువకట్ట ప్రాంతంలోనే 127 కేసులు నమోదయ్యాయి. అప్రమత్తమైన అధికారులు... కరోనా కట్టిడి కోసం ఫోర్ పాయింట్ ఫార్ములాతో ముందుకెళ్తున్నారు. సంపూర్ణంగా లాక్ డౌన్ అమలు, ప్రజల అవసరాలు తీర్చేలా చర్యలు, పాజిటివ్ లింకులపై సమగ్ర సమాచార సేకరణ, వ్యాధి నిర్ధరణ పరీక్షలు వేగవంతం చేయటం ద్వారా వైరస్ నియంత్రణకు నడుం కట్టారు. ఈనెల 15 తర్వాత కొత్త కేసులేవీ నమోదు కాకూడదనే లక్ష్యంతో మిషన్ మే-15కు రూపకల్పన చేశారు. మిషన్ అమలు చేసే బాధ్యతను రెవెన్యూ, పోలీసు, పురపాలక, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, ప్రజారోగ్య శాఖలు తీసుకున్నాయి.

1. సంపూర్ణ లాక్​డౌన్

వైరస్ కట్టిడికి అధికారులు ఎంచుకున్న మొదటి ఆయుధం సంపూర్ణ లాక్​డౌన్. పట్టణంలో ప్రజలు ఎవరూ బయటకు రాకుండా చర్యలు చేపట్టారు. ఎవరైనా రోడ్లపై కనిపిస్తే నేరుగా క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తామని అధికారులు హెచ్చరించారు. లాక్​డౌన్ అమలు కోసం 300 మంది పోలీసులను నియమించారు. అదనపు ఎస్పీ చక్రవర్తితో పాటు డీఎస్పీ వీరారెడ్డి రెడ్​జోన్లతో పాటు పట్టణంలో తిరుగుతూ లాక్​డౌన్​ను పర్యవేక్షిస్తున్నారు.

2. ఇంటి వద్దకే నిత్యావసరాలు

రెడ్​జోన్లలో ప్రజలు బయటకు రాకుండా ఉండాలంటే వారికి కావాల్సినవి అందించాలి. ఇందుకోసం మొబైల్ వాహనాలు, కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా కంట్రోల్ రూంకు సమాచారమిస్తే వాటిని సమకూరుస్తున్నారు. దీని కోసం వాలంటీర్లు, రెడ్​ క్రాస్ ప్రతినిధులను వినియోగిస్తున్నారు. అలాగే దాదాపు 1200 పేదల కుటుంబాలకు స్థానిక ఎమ్మెల్యే నిత్యావసరాల కిట్లు అందజేశారు.

3. పాజిటివ్ లింకులపై ఆరా

పట్టణంలో కరోనా ఎలా వచ్చిందనేది తేల్చేందుకు అధికారులు జరిపిన కసరత్తు అంతా ఇంతా కాదు. మర్కజ్ వెళ్లివచ్చిన వారు కేవలం నలుగురే ఉన్నారు. వారిలో ఎవరికీ వైరస్ సోకలేదు. కానీ అనూహ్యంగా కేబుల్ ఛార్జీలు వసూలు చేసే వ్యక్తికి కరోనా వచ్చింది. అది కూడా అతను మరణించిన తర్వాత కరోనాగా తేలింది. అధికారులకు దాని మూలాలు పట్టుకోవటం కత్తిమీద సాములా మారింది. అతని సెల్ సిగ్నల్స్ ఆధారంగా కూపీ లాగారు. గుంటూరు నుంచి ఓ పాజిటివ్ వ్యక్తి నర్సరావుపేట వెళ్లి అతడిని కలిసినట్లు గుర్తించారు. గుంటూరు వ్యక్తి ద్వారా కేబుల్​ ఛార్జీలు వసూలు చేసే వ్యక్తికి... అక్కడి నుంచి అతని కుటుంబసభ్యులు, ఇరుగు పొరుగు వారు, వారి ద్వారా ఓ హోంగార్డు.....అతని నుంచి ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది... ఇలా వైరస్ వ్యాప్తి జరిగినట్లు పోలీసులు తేల్చారు. పాజిటివ్ వచ్చిన వారి కదలికల్ని నమోదు చేస్తున్నారు. గత రెండు వారాలు వారు ఎక్కడికెళ్లింది?....ఎవరిని కలిసింది? ఆరా తీస్తున్నారు. అనుమానితుల్ని గుర్తించటం ద్వారా వారికి వైరస్ ఉన్నా ఇతరులకు సోకకుండా అడ్డుకట్ట పడుతుందనేది పోలీసుల ఆలోచన.

4. కరోనా నిర్ధరణ పరీక్షలు

రెడ్​జోన్లలో ప్రతి ఇంట్లో కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 25 మందికి పైగా వైద్యులు ఇదే పనిలో ఉన్నారు. 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎవరికైనా పాజిటివ్ తేలితే బాధితుడిని, అతని కుటుంబ సభ్యులను, బంధువులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇప్పటి వరకూ నర్సరావుపేటలో 3,500 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇంకా 300మందికి సంబంధించిన నివేదికలు రావాల్సి ఉంది. వైరస్ నిర్మూళన కోసం పట్టణంలో నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఇదీ చదవండి

రాష్ట్రంలో కొత్తగా 60 కేసులు

Last Updated : May 6, 2020, 8:09 PM IST

ABOUT THE AUTHOR

...view details