Special Camps for Electoral Roll Modifications: రాయలసీమ జిల్లాల్లో ఓటర్ల జాబితా పరిశీలనకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఓట్ల నమోదు, మార్పులు, చేర్పులు, ఫిర్యాదులు స్వీకరించారు. గోళ్ల గ్రామంలో ప్రత్యేక శిబిరాన్ని ఆర్డీవో పరిశీలించారు. కొన్నిచోట్ల సంబంధిత సిబ్బంది ఆలస్యంగా వచ్చారు. కళ్యాణదుర్గం మండలంతో పాటు కంబదూరు, కుందుర్పి బ్రహ్మసముద్రం, సెట్టూరు మండలాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించగా ఒకటి రెండు చోట్ల అధికారులు పర్యవేక్షించారు.
తిరుపతి జిల్లా నాయుడుపేటలో బీఎల్వోలు సమయానికి రాకపోవడంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లాలో ఓటర్ల జాబితాను పరిశీలించిన బీఎల్వోలు.. ఫిర్యాదుల ఆధారంగా సరిచూశారు. రాజకీయపార్టీల ప్రతినిధులు డబుల్ ఎంట్రీలపై ఫిర్యాదులు చేశారు. ఒకే వ్యక్తికి రెండుచోట్ల ఓటు ఉండటం, మరణించిన వారి పేర్లు తొలగించకపోవడం, భార్యాభర్తల ఓట్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఉండటం వంటివి ఎక్కువగా గుర్తించారు.
నెల్లూరులో ఓట్ల పరిశీలన కోసం పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. నగర నియోజకవర్గ పరిధిలో 248 పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి ఎన్నికల అధికారులు ఈ శిబిరాల్లో పాల్గొన్నారు. ఓటర్ల జాబితాతో పాటు ఓట్ల నమోదు, మార్పులు, చేర్పులకు సంబంధించిన పత్రాలను అందుబాటులో ఉంచారు. నగరంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాలను కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్ పరిశీలించారు. ఓటర్లకు ఎలాంటి అభ్యంతరాలున్నా ఈ శిబిరాలు వద్ద తెలియజేయాలని ఈ సందర్భంగా కమిషనర్ కోరారు. నగరంలో ఇప్పటికే రెండు వేల డబల్ ఎంట్రీ ఓట్లను తొలగించామని, ఇంకా ఏమైనా అభ్యంతరాలు వస్తే పరిశీలించి తొలగిస్తామని కమిషనర్ తెలిపారు.