గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఈనెల 24వ తేదీన జరిగిన అనూష హత్య సంచలనం సృష్టించింది. కృష్ణవేణి కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నఅనూషను సహ విద్యార్థి విష్ణువర్ధన్ రెడ్డే హత్యే చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని ఈ రోజు గుంటూరులో మీడియా ముందు ప్రవేశపెట్టారు. హత్యకు దారితీసిన పరిణామాలను గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ వివరించారు. విష్ణువర్థన్ రెడ్డి అనూషను ప్రేమిస్తున్నారని తెలిపారు. అయితే ఇటీవలి కాలంలో అనూష మనోజ్ అనే మరో యువకునితో మాట్లాడటాన్ని విష్ణు జీర్ణించుకోలేకపోయాడు. ఇదే విషయంపై ఆమెను నిలదీశాడు.
ఈనెల 24వ తేదీన నరసరావుపేట నుంచి అనూషను పాలపాడు సమీపంలోని కాలువ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని... ఈ క్రమంలో విష్ణువర్థన్ రెడ్డి ఆగ్రహంతో అనూషను కింద పడేసి... గొంతు నులిమి చంపేశాడని ఎస్పీ వివరించారు. అనంతరం సాక్ష్యాధారాలు లేకుండా చేసేందుకు మృతదేహాన్ని కాలువలో పడేసినట్లు తెలిపారు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని శవాన్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు విషయం తెలియటంతో విష్ణువర్థన్ రెడ్డి స్వయంగా స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. ఈ ఘటన చాలా దారుణమైందని ఎస్పీ అభిప్రాయపడ్డారు. పోలీసులు ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ జరిపారని... అన్ని ఆధారాలు కోర్టుకు నివేదిస్తామని తెలిపారు. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని కోర్టును కోరతామని... ముద్దాయికి శిక్ష పడేలా చూస్తామని వివరించారు.