ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్పీ బాలుకు గుంటూరు జిల్లాతో ప్రత్యేక అనుబంధం - SP Balu news

గాన మాధుర్యంతో భారతీయ చలన చిత్రసీమలో తనదైన ముద్ర వేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు గుంటూరు జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది. పలు సందర్భాల్లో ఆయన ఇక్కడికి విచ్చేశారు. ఆ జ్ఞాపకాలను ఓ సారి మననం చేసుకుందాం.

SP Balu has a special affiliation with Guntur district
ఎస్పీ బాలుకు సత్కారం

By

Published : Sep 26, 2020, 8:47 AM IST

ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్నబాలు

మధుర గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు గుంటూరు జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉందని ....అక్కడి కళాభిమానులు, సాహితీ ప్రియుల గుర్తు చేసుకుంటున్నారు. 1993లో గుంటూరు రౌండ్ టేబుల్ సంస్థ నిర్వహించిన బాలు గారి కచేరికి లక్ష మంది తరలి వచ్చారని అంచనా. ఆ తర్వాత 2002లో 'దొరకునా ఇటువంటి సేవ' అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలు ద్వారా పరిచయమైన 60 మంది గాయకులందరినీ ఒకే వేదికపైకి రప్పించిన కార్యక్రమం అది. ఆ తర్వాత పాడుతా తీయగా కార్యక్రమం కోసం కూడా పలుమార్లు గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరానికి వచ్చారు.

పాలతాలికలు ఎంతో ఇష్టంగా తింటున్న ఎస్పీ బాలు

గుంటూరులో కోటి మొక్కలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఆకాంక్షను బాలు వ్యక్తం చేశారని... ఆ మేరకు అలాంటి కార్యక్రమాన్ని చేపడతామని వెంకటేశ్వర విజ్ఞాన మందిరం కార్యదర్శి పి.ఆర్.రాజు తెలిపారు. పాడుతా తీయగా 500 ఎపిసోడ్​ను నర్సరావుపేటలో నిర్వహించారు. అప్పటి శాసనసభాపతి కోడెల శివప్రసాద్ సహకారంతో కార్యక్రమం జరిగింది. బాలు ఎక్కడకు వెళ్లినా ఆ ప్రాంతానికి చెందిన ప్రముఖుల గురించి తెలుసుకోవటం, వారి గురించి తన కార్యక్రమాల్లో చెప్పటం ద్వారా వారి ఖ్యాతిని ప్రపంచానికి తెలియజెప్పేవారని సాహితి స్రవంతి కార్యదర్శి లక్ష్మీనారాయణ గుర్తు చేసుకున్నారు. పాటలు పాడటం మొదలు పెట్టిన నాటి నుంచి ఐదు దశాబ్దాలకు పైగా ఒకే తరహా గొంతు ఉండటం బాలు గారి ప్రత్యేకత అని అన్నారు. పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటి మనిషి అయ్యారని... నేటి తరంలో భాషాభిమానాన్ని పెంపొందించారని కొనియాడారు.

చిలకలూరిపేటతో అనుబంధం

కొన్ని జ్ఞాప‌కాలు ప‌దిలంగానే ఉంటాయి. గాన‌గాంధ‌ర్వుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు అని తెలుసుకున్న గుంటూరు జిల్లా చిలకలూరిపేట ప్రాంత ప్రజానీకం ఆయ‌న స్మృతుల్ని గుర్తు చేసుకుంటున్నారు. బాలు కుమారుడు చరణ్​ను కూడా ఇక్కడ వేదికపై నుంచే ప్రేక్షకులకు పరిచయం చేశారని జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు.

1999 ఏప్రిల్‌14న ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం చిల‌క‌లూరిపేట మండ‌లం మిట్ట‌పాలెం గ్రామంలో టి.క్రిష్ణ మెమోరియల్ కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాటకాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం నాట‌కాన్ని వీక్షించి, త‌న‌ గానంతో అల‌రించారు. అదేవిధంగా నాట‌కం, దాని ప్రాశ్చ‌త్యం గురించి అరుదైన ఉప‌న్యాసం ఇచ్చారు. అయ‌న‌కు పాల‌ తాలికలు అంటే ఇష్టం. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన విందులో వీటినే వ‌డ్డిస్తే ఇష్టంగా తిన్నారని... అయ‌న‌తో మాట్లాడటం గడిపిన సమయం ‌ఇప్పటికీ మరిచిపోలేం అంటారు గ్రామస్తులు. ఈ సందర్భంగా నిర్వాహకులు దండా గోపి బాల‌సుబ్ర‌మ‌ణ్యంకు ఆయన గురువు కోదండ‌పాణి వెండి విగ్ర‌హాన్ని బ‌హుక‌రిస్తే ఎంతో అప్యాయ‌త‌తో స్వీక‌రించారన్నారు.

ఎస్పీ చరణ్ ప‌రిచ‌యానికి తొలివేదిక‌

బాల‌సుబ్ర‌మ‌ణ్యంతో పాటు ఆయ‌న కుమారుడు చ‌ర‌ణ్ కూడా మిట్ట‌పాలెం గ్రామానికి వ‌చ్చారు. ఇదే వేదిక నుంచే త‌న కుమారుడు చ‌ర‌ణ్‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేస్తూ... తాను సినీ నేపథ్య గాయ‌కుడిగా కొన‌సాగ‌నున్నాడ‌ని ప్రేక్షకుల హర్షధ్వానాలు మధ్య తెలిపారు. త‌నలాగే చ‌ర‌ణ్‌ను కూడా ఆద‌రించి ఆశీర్వి‌దించాల‌ని కోరారు.

ఇదీ చదవండి:27 ఏళ్ల తర్వాత ఆయనతో కలిసి పాడిన బాలు

ABOUT THE AUTHOR

...view details