కరోనా కారణంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారు ఆ సాఫ్ట్వేర్ దంపతులు. ఈ పరిస్థితుల్లో ఓవైపు ఉద్యోగ బాధ్యతలు చేపడుతూనే.. మరోవైపు ప్రవృత్తిలో ఒదిగిపోతున్నారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం జగ్గాపురానికి చెందిన శ్రీధర్ బాబు, అతని భార్య లక్ష్మీ హైదరాబాద్లో పదేళ్లుగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. కరోనా ప్రభావంతో 9 నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి.. వ్యవసాయం, డెయిరీని విజయవంతంగా నడిపిస్తున్నారు. ఒక పక్క కంపెనీ అప్పగించిన కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే.. మరోపక్క వ్యవసాయానికి సమయాన్ని కేటాయిస్తున్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఇరువురు.. సాగుపై మక్కువతో పాడిని అభివృద్ధి చేస్తున్నారు.
ఈ ఏడాది ఎకరా విస్తీర్ణంలో మిర్చి, రెండెకరాల్లో పత్తి, 27 ఎకరాల్లో శనగ పంటలను పండిస్తున్నారు. వారి భూమితోపాటు కొంత భూమిని సైతం కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నారు. గతంలో 4 గేదెలుండగా.. ఇప్పుడా డెయిరీ ఫాంలో 15 గేదెలు పెంచుతున్నారు. తనకు వ్యవసాయమంటే ఇష్టమని.. కరోనా మూలంగా మళ్లీ సాగు చేసే అవకాశం వచ్చిందని శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీధర్ బాబు భార్య లక్ష్మీ సైతం వర్క్ ఫ్రమ్ హోం చేస్తూనే.. ఇంటి పనులు, అప్పుడప్పుడూ డెయిరీ, వ్యవసాయ పనులు చేస్తూ.. భర్తకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. స్వయంగా కాయగూరలు, ఆకుకూరలు పండించి తినటం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవని చెబుతున్నారు.