ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాఫ్ట్​వేర్​ వృత్తి .. వ్యవసాయం ప్రవృత్తి - గుంటూరు జిల్లాలో వ్యవసాయంలో రాణిస్తున్న సాఫ్ట్​వేర్​ ఇంజనీర్లు

వారంతా ఉన్నత విద్యనభ్యసించారు. ప్రముఖ సంస్థల్లో పని చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. అయినప్పటికీ వారికి మట్టిపై మమకారం ఏమాత్రం తగ్గలేదు. వినూత్న ఆలోచనలను ఆచరణలో పెట్టి అద్భుతాలు చేస్తున్నారు. రైతుల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. వాళ్లు ఎవరు.. వారి కథేంటి తెసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే!

software engineers doing cultivations
సాఫ్ట్​వేర్​ వృత్తి .. వ్యవసాయం ప్రవృత్తి

By

Published : Jan 10, 2021, 12:49 PM IST

ఉన్నత చదువులు చదివి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పని చేస్తున్న ఆ యువకులకు మట్టి వాసనపై మమకారం పోలేదు. వినూత్న ఆలోచనలు ఆచరణలో పెట్టి ఎప్పటినుంచో సాగు చేస్తున్న రైతుల్లో స్ఫూర్తి నింపుతున్నారు.

పండ్ల తోటల సాగు

గుంటూరు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన కాసర్ల కృష్ణారెడ్డి హైదరాబాద్‌లోని ఒరాకిల్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. కొవిడ్‌ నేపథ్యంలో ఇంటి వద్ద నుంచే విధులు నిర్వర్తిస్తున్నాడు. తమకు ఉన్న 15 ఎకరాల పొలంలో పెట్రోల్‌ బంకును నాలుగేళ్ల క్రితం ప్రారంభించారు. బంకు వెనుక ఉన్న 20 సెంట్ల విస్తీర్ణంలో పండ్ల తోట, కూరగాయలు, ఆకుకూరల సాగుతో పాటు పక్కనే రమణీయంగా ఈతకొలను సిద్ధం చేశాడు.

వనంలో వివిధ రకాలను కోళ్లను పెంచుతున్నాడు. బేర్‌ ఆపిల్‌, సపోట, బొప్బాయి, నేరేడు, దానిమ్మ, ద్రాక్ష, కమల, చెరుకు, వంటి పండ్ల రకాలను సాగు చేస్తున్నాడు. సేంద్రియ సాగు పద్ధతిలో మునగ, వంకాయ, కాకర, సోర, పొట్టకాయ, మిర్చి, బెండలను పండిస్తున్నాడు. తోటలోనే వినూత్నంగా పలు రకాల నాటుకోళ్లను పెంచుతున్నాడు. ఇప్పటికి 140 నాటు రకం కోళ్లు తోటలో పెరుగుతున్నాయి. పక్కనే తనకున్న 15 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు.

బొప్పాయి సాగు.. ఆదాయం బాగు

ముప్పాళ్ల మండలం నార్నెపాడుకు చెందిన రావిపాటి సైదారావు బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేసి 2013 నుంచి 2019 వరకు హైదరాబాద్‌లోని వివిధ ఐటీ కంపెనీల్లో పని చేశాడు. తల్లిదండ్రులు, తెలిసిన వారికి దూరంగా యాంత్రిక జీవనం చేస్తున్నాననే ఆలోచనతో విసుగొచ్చింది. ఇంటికి వచ్చి వర్క్‌ఫ్రం హోం చేస్తూనే సొంతంగా ఉన్న 14 ఎకరాల్ని మాగాణి నుంచి మెట్టగా మార్చాడు. వరి పండించే పొలంలో బొప్పాయి సాగు చేపట్టడంతో అందరూ నవ్వారు. డ్రిప్‌ పద్ధతిలో ఐదెకరాల్లో బొప్పాయి పంటను విజయవంతంగా సాగు చేశాడు.

ఎకరాకు రూ.లక్ష ఆదాయాన్ని పొందాడు. అందులోనే అంతర పంటగా అరటి సాగు చేశాడు. విపత్తుల్ని తట్టుకుని అరటి గెలలు విరగకాశాయి. ఇందుకు సేంద్రియ పద్ధతులు పాటించడమే కారణమని సైదారావు తెలిపాడు. అరటితో పాటు కాకర తోటను ప్రస్తుతం సాగు చేస్తున్నారు. 30 నెలల్లో మూడు రకాల పంటల దిగుబడుల్ని పొందేందుకు ఇంటిగ్రేటెడ్‌ పెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ (ఐపీఎం) పద్ధతుల్ని పాటిస్తున్నట్లు తెలిపారు. ఆయన భార్య హారిక కూడా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. కొవిడ్‌తో ఆమె కూడా ఇంటికి వచ్చి సాగులో భర్తకు చేదోడుగా ఉంటున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కంటే వ్యవసాయంలో ఎంతో సంతృప్తి ఉందని, మూస పద్ధతుల్ని వీడి అధునాతనంగా సాగుబాట పడితే విజయాల్ని సాధించవచ్చని యువ రైతులు చెప్పారు.

ఇదీ చదవండి:

ఈ చిత్రాన్ని చూశారా?... ఇదో పెద్ద వ్యవహారం!

ABOUT THE AUTHOR

...view details