BIRDS FARMING: అమెరికా, ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయాన్ని ఒక్కో వ్యక్తి పెద్దఎత్తున సాగుచేస్తున్న విధానం అతనికి నచ్చింది. ఒక్కో వ్యక్తి 25 ఎకరాల వరకు సాగుచేస్తుండటం.. అదీ ఉదయం ఉద్యోగం చేస్తూ.. సాయంత్రం వ్యవసాయం చేయడం అతడిని ఆకర్షించింది. కరోనా సమయంలో ఇండియాకు వచ్చిన అశోక్.. తను సైతం ఏదో పాడిపరిశ్రమను పెట్టాలనుకున్నారు. అందరికంటే భిన్నంగా ఆలోచించిన అశోక్.. నగరానికి శివారులోని వెనిగండ్లలో కౌజు పిట్టలు, నాటుకోళ్ల పెంపకాన్ని చేపట్టారు. సాధారణ కోళ్ల కంటే కౌజు పిట్టల్లో పోషకాలు అధికంగా ఉండటం.. లభ్యత తక్కువగా ఉండటంతో కౌజు పిట్టల పెంపకాన్ని ఎంచుకున్నారు. ఇందుకోసం అర ఎకరం స్థలాన్ని అద్దెకు తీసుకున్నారు.
స్నేహితుడి సహకారంతో చెరో 2 లక్షల పెట్టుబడితో వెయ్యి కౌజు పిట్టలను కొనుగోలు చేసి పెంపకాన్ని ప్రారంభించారు. వాతావరణ పరిస్థితులకు తోడు దాణాలో సమతుల్యత లేకపోవడం, పోషణ మెళకువలు తెలియక 200 పిట్టలు చనిపోయాయి. గన్నవరంలోని పశువైద్య కళాశాల అధ్యాపకులను కలిసి వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. అలా ఒడుదొడుకుల్ని తట్టుకుంటూ మళ్లీ లాభార్జన దిశగా ప్రస్తుతం సాగుతున్నారు.
మార్కెట్లో వీటి మాంసాన్ని కొనుగోలు చేసేవారి సంఖ్య పెరుగుతుండటంతో తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. కౌజు పిట్టలను సొంతంగా ఉత్పత్తి చేయడానికి హ్యాచింగ్ మిషన్ ను కొనుగోలు చేసి పిట్టలు పెట్టిన గుడ్లను మిషన్లో పొదిగిస్తున్నారు. ఒకేసారి 6వేల పిట్టలను తయారుచేసే సామర్థ్యం ఉండటంతో పిట్టల కొనుగోలు సమస్య తప్పింది. నిరంతర విద్యుత్ సరఫరా కోసం త్వరలో సోలార్ విద్యుత్ యూనిట్ ను కొనుగోలు చేశారు. ఒక్కో సవాల్ ను అధిగమించి ప్రస్తుతం లాభాల దిశగా సాగుతున్నారు. వ్యవసాయం, పాడిపరిశ్రమపై ఇష్టంతో.. మనదేశంలో ఉండి సొంత వ్యాపారం చేయాలనే లక్ష్యంతో ఈ మార్గం ఎంచుకున్నట్లు అశోక్ చెప్పారు.