ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Shivasri: న్యాయం కోసం ప్రశ్నిస్తే.. నిరాశ్రయురాలిగా మార్చారు..

జనసైనికులకు అండగా ఉంటానన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. గుంటూరు జిల్లాలో ఇటీవల జరిగిన ఇళ్ల స్థలాల తొలగింపు విషయంలో.. అధికారులను ప్రశ్నించిన మహిళపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరింపులకు పాల్పడటాన్ని పవన్ కల్యాణ్ ఖండించారు. ఆ మహిళకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాసరావు తన అపార్ట్​మెంట్​లో ఓ ప్లాట్​ని శివశ్రీకి ఇచ్చారు. శివశ్రీ శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునే వరకు కొలనుకొండలోని హైమా రామచంద్ర రెసిడెన్సీలోని ప్లాట్​లో ఉండవచ్చని ఆయన తెలిపారు. రెండు రోజులుగా గుంటూరులో వివాదాస్పదమైన ఈ ఘటన పూర్వపరాలను చూస్తే...

pawan kalyan
న్యాయం కోసం ప్రశ్నిస్తే.. నిరాశ్రయురాలిగా మార్చారు..

By

Published : Jul 23, 2021, 10:39 AM IST

Updated : Jul 23, 2021, 6:51 PM IST

గుంటూరు జిల్లా అమరావతి నగర్​లోని ఇళ్ల తొలగింపు విషయంలో.. అధికారులను ప్రశ్నించిన మహిళను పోలీసులు బెదిరించారు. ఈ మేరకు ఆ మహిళ జనసేన అధినేత పవన్ కల్యాణ్​ను కలిసింది. ఆయన తనకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామి ఇచ్చి.. మాటను నిలబెట్టుకున్నారు.

అసలేం జరిగింది

ముఖ్యమంత్రి జగన్‌ నివాసానికి సమీపంలోని అమరారెడ్డినగర్‌ కాలనీకి చెందిన వి.శివశ్రీ అనే యువతిని రెండ్రోజలు క్రితం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకోవటం వివాదాస్పదమైంది. న్యాయం కోసం డిమాండ్‌ చేస్తున్న ఆమెపై.. అక్రమ కేసులు పెడతామని బెదిరించి, స్టేషన్​కు తీసుకెళ్లారు. పలు పార్టీల నాయకులు స్టేషన్​ ముందు ఆందోళ చేపట్టారు. దీంతో పోలీసులు ఆమెను విడిచిపెట్టారు.

అమరారెడ్డినగర్‌ కాలనీలోని 317 కుటుంబాల్ని ఖాళీ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. పరిహారం, నివాస స్థలం, ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చింది. వారిలో కొద్దిమందికి స్థలాలు రాలేదు. ఇల్లూ మంజూరు కాలేదు. కొత్తగా స్థలాలిచ్చిన చోట ఇళ్ల నిర్మాణం పూర్తికాలేదు. అయితే రెండు రోజులుగా అమరారెడ్డికాలనీలో ఇళ్లను నగరపాలక సంస్థ కూల్చేస్తోంది. అన్ని అర్హతలున్న తన సోదరుడికి స్థలమివ్వలేదని, తమకు ప్రభుత్వమిచ్చిన పరిహారంతో ఇంటి నిర్మాణం పూర్తవదని శివశ్రీ అధికారులను ప్రశ్నించారు. మంగళవారం సాయంత్రం.. ఆమెను తాడేపల్లి పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి రాత్రి 10 గంటలకు విడిచిపెట్టారు.

బుధవారం ఉదయం 6గంటలకు మరోసారి స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో తెదేపా, జనసేన, సీపీఎం నాయకులు అక్కడికి చేరుకుని శివశ్రీని ఎందుకు అదుపులోకి తీసుకున్నారని ప్రశ్నించారు. ఆమెపై స్థానికులు కేసు పెట్టినందునే అదుపులోకి తీసుకున్నామని పోలీసులు సమాధానమిచ్చారు. ఆమెను విడుదల చేయాలంటూ అఖిలపక్ష నాయకులు తెనాలి శ్రవణ్‌కుమార్‌, గంజి చిరంజీవి, చిల్లపల్లి శ్రీనివాసరావు, దొంతిరెడ్డి వెంకటరెడ్డి పట్టుబట్టడంతో ఉదయం 11 గంటలకు విడిచిపెట్టారు.

వైకాపా నాయకులు వేధిస్తున్నారు

నిర్వాసితులమవుతున్న మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలని పోరాడుతున్నాను. సమస్యను 7వ తేదీన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లాను. అప్పటి నుంచి స్థానిక వైకాపా నాయకులు, వారి అనుచరులు నన్ను వేధిస్తున్నారు. బెదిరిస్తున్నారు. కాలువకట్ట మీద నుంచి ఖాళీ చేయించినవారందరికీ ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇవ్వడంతోపాటు పరిహారం సొమ్ము పెంచాలని కోరుతున్నందునే నన్ను పదేపదే స్టేషన్‌కు తీసుకెళ్లి వేధిస్తున్నారు. నేను గతంలో వాలంటీర్‌గా ఉండి, రాజీనామా చేశాను. జగన్‌ పాలనలో అవినీతిని తెలియజేయాలనే పవన్‌కల్యాణ్‌ను కలిశాను.-వి.శివశ్రీ

నోటీసిచ్చిన గంటల్లోనే ఇల్లు కూల్చివేత
బుధవారం సాయంత్రం 6గంటల సమయంలో శివశ్రీ తల్లి రాజ్యలక్ష్మి పేరిట ఉన్న ఇంటికి జలవనరుల శాఖ తెనాలి విభాగం ఈఈ పేరుతో నోటీసులు అంటించారు. ‘కాలువకట్టపై జలవనరులశాఖ స్థలంలోని అక్రమ కట్టడంలో మీరు నివసిస్తున్నారు. మీకు ఆత్మకూరులో 2 సెంట్ల స్థలం కేటాయించి, పట్టా ఇచ్చాం. ఇల్లు కూడా మంజూరు చేశాం. మీ ఖాతాలో పరిహారం కింద రూ.2,70,380 జమ చేశాం. ఇంటి స్థలం పొంది 33 రోజులైనా మీరు అక్రమ కట్టడం నుంచి వైదొలగలేదు. 24 గంటల్లోపు ఖాళీ చేయకపోతే మేమే తొలగిస్తాం’ అని నోటీసులో పేర్కొన్నారు.

రాత్రి 8గంటలకు ఇంటిని కూల్చేసేందుకు నగరపాలక సిబ్బంది జేసీబీలతో రావడం చూసి రాజ్యలక్ష్మి గుండెపోటుతో కింద పడిపోయారు. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. రాత్రి 10 గంటలకే ఇంట్లోని సామగ్రిని రెండు ట్రాక్టర్లలోకి చేర్చిన సిబ్బంది, 11 గంటలకు ఇంటిని కూల్చివేశారు. దీనికి నిరసనగా ఆత్మహత్యకు యత్నించిన శివశ్రీ సోదరుడిని.. పోలీసులు అడ్డుకుని ఇంట్లో నుంచి బలవంతంగా బయటకు తీసుకొచ్చారు.

శివశ్రీ అపార్టెమెంట్​లో ఉండేలా జనసేన నేత సహాయం

జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాసరావు తన అపార్ట్​మెంట్​లో ఓ ప్లాట్​ని శివశ్రీకి ఇచ్చారు. శివశ్రీ శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునే వరకు కొలనుకొండలోని హైమా రామచంద్ర రేసిడెన్సీలోని ప్లాట్​లో ఉండవచ్చని చిల్లపల్లి శ్రీనివాస్ తెలిపారు.

ఇదీ చదవండి:

ap inter results 2021: ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల..

Last Updated : Jul 23, 2021, 6:51 PM IST

ABOUT THE AUTHOR

...view details