MLAs Poaching Case Update : 'ఎమ్మెల్యేలకు ఎర' కేసులో నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు జరిగిన కుట్రపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. కుట్రలో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్‌కు సంబంధం ఉన్నట్టు నివేదికలో పేర్కొన్నారు. కేసు దర్యాప్తునకు సంబంధించి పురోగతిపై హైకోర్టుకు సిట్ నివేదిక సమర్పించింది. దిల్లీలో బీఎల్ సంతోష్ ఇంట్లోనే కుట్రకు సంబంధించిన కీలక సమావేశం జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం ఆధారాలు సేకరించింది.
MLAs Poaching Case Update
By
Published : Dec 1, 2022, 9:50 AM IST
MLAs Poaching Case Update : ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు దర్యాప్తులో పురోగతి గురించి హైకోర్టుకు సిట్ సమర్పించిన నివేదికలో సంచలన విషయాలు బహిర్గతమయ్యాయి. కుట్రలో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్‌కు సంబంధాలున్నట్లు నివేదిక వెల్లడించింది. దిల్లీలో ఆయన ఇంట్లోనే కుట్రకు సంబంధించి కీలక సమావేశం జరిగినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. అలాగే నిందితులంతా కుట్ర గురించి చర్చించుకున్న ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్నీ సిట్ సేకరించింది.
ఇప్పటివరకు ప్రధాన నిందితుడు రామచంద్ర భారతికి, బీఎల్ సంతోష్‌కు మధ్య జరిగిన వాట్సప్ సంభాషణల కీలక సమాచారం బహిర్గతమైంది. నిందితుల మధ్య జరిగిన ఇన్‌స్టాగ్రామ్ చాటింగ్‌లూ బయటపడ్డాయి. తెలంగాణలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పేర్లతోపాటు ప్రస్తుత రాజకీయ స్థితిగతుల గురించి పెద్దఎత్తున చాటింగ్ జరిగినట్లు సిట్ నివేదికలో వెల్లడైంది.
హరిద్వార్.. దిల్లీ.. నాగ్‌పుర్‌లలో సమావేశాలు..
* రామచంద్రభారతికి బీఎల్ సంతోష్‌తో చాలాకాలంగా పరిచయముంది. వారిద్దరి మధ్య గతేడాది ఆగస్టులో పలు వాట్సప్ చాటింగ్‌లు జరిగాయి.
* హరిద్వార్‌లో ఈ ఏడాది ఏప్రిల్ 11న రామచంద్ర భారతి, సంతోష్‌ల సమావేశం జరిగింది. ఆ సమయంలో వారిద్దరి ఫోన్ల లొకేషన్లు అక్కడే ఉన్నాయి. సిట్ విచారణ సందర్భంగా ఎన్‌జీవో ప్రతినిధి ముంజగళ్ల విజయ్ ఇదే విషయాన్ని ధ్రువీకరించారు.
* ఆగస్టు 21న కుట్రకు సంబంధించి దిల్లీలోని కల్కాజిలో సమావేశం జరిగింది. వరల్డ్ బ్రాహ్మణ్ ఫెడరేషన్ కేసీ పాండే ఇంట్లో అతడితోపాటు రామచంద్రభారతి, సింహయాజి, న్యాయవాది ప్రతాప్ హాజరై చర్చించారు.
* దిల్లీ వరల్డ్ బ్రాహ్మణ్ ఫెడరేషన్‌లో సెప్టెంబరు 4న రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజి, కరీంనగర్ న్యాయవాది బూసారపు శ్రీనివాస్ ఈ కుట్రకు సంబంధించి సమావేశం నిర్వహించారు. వీరందరి ఫోన్ లొకేషన్లు అక్కడే చూపించాయి.
* నందకుమార్, సింహయాజి, శ్రీనివాస్ నాగ్‌పుర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. భారతీయ రక్షా మంచ్ వార్షిక సదస్సులో పాల్గొన్నారు. అక్కడే పలువురు నేతల్ని కలిశారు.
* కుట్రకు సంబంధించి కీలక సమావేశం సెప్టెంబరు 26న నందకుమార్ ఇంట్లో జరిగింది. ఆయనతోపాటు రామచంద్ర భారతి, సింహయాజి, శ్రీనివాస్, ప్రతాప్, విజయ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డిని అక్కడికి పిలిచి మాట్లాడారు. విజయ్ వాంగ్మూలం ఇదే విషయాన్ని ధ్రువీకరించింది.
* కుట్రకు సంబంధించి సెప్టెంబరు 26 నుంచి ఆగస్టు 14 వరకు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజి, జగ్గుస్వామి, బీఎల్ సంతోష్, తుషార్, ప్రతాప్, విజయ్‌ల మధ్య తరచూ వాట్సప్ చాటింగ్‌లు జరిగాయి. ఫోన్‌లో కూడా మాట్లాడుకున్నారు.
* కుట్రలో అత్యంత కీలకమైన సమావేశం అక్టోబరు 15న దిల్లీలో బీఎల్ సంతోష్ ఇంట్లో (ప్రభుత్వ క్వార్టర్) జరిగింది. ఆ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశంలో సంతోష్‌తోపాటు తుషార్, రామచంద్ర భారతి, నందకుమార్, విజయ్ పాల్గొన్నారు. సిట్ విచారణలో విజయ్ ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చారు. అతడి ఫోన్‌లోనూ అక్కడి వీడియో లభ్యమైంది. నిందితుల ప్రయాణ వివరాలను.. దిల్లీలో మకాం ఉన్న ప్రాంతాల వివరాలనూ సిట్ సేకరించింది. న్యాయవాది ప్రతాప్ సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
* కుట్ర గురించి రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజి, జగ్గుస్వామి, శ్రీనివాస్, ప్రతాప్, విజయ్‌ల మధ్య సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 26 వరకు వాట్సప్ చాటింగ్‌లు జరిగాయి.
కోదండరాం.. రాజనర్సింహాలనూ సంప్రదించారు..:సింహయాజీ కొందరు రాజకీయ పార్టీల నేతలతో హైదరాబాద్‌లోని స్కైహై హోటల్‌లో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతమున్న పార్టీల్లో నుంచి భాజపాలోకి మారడం కోసమంటూ ఈ భేటీ ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహా తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. సిట్ విచారణలో న్యాయవాది ప్రతాప్, విజయ్ ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. సింహయాజీతో పాటు సదరు రాజకీయ నేతల సెల్‌ఫోన్ లొకేషన్లు ఆ సమయంలో అదే ప్రాంతంలో ఉన్నాయి.
సంతోష్, రామచంద్ర భారతి వాట్సప్ చాటింగ్..:
రామచంద్ర భారతి: ‘నిన్న రాత్రి పది గంటల వరకు మీ స్పందన కోసం వేచి చూశాను. ముగ్గురు వ్యక్తులను మీకు పరిచయం చేయాలి. అలాగే చాలా కాలం తర్వాత మిమ్మల్ని ఒకసారి చూడాలని ఉంది..’
సంతోష్:సారీ.. తీరిక లేకుండా ఉన్నందున సమయం ఇవ్వలేకపోయాను. నేను కొన్ని విషయాలు గుర్తు చేయదలుచుకున్నాను. 1.నమ్మదగ్గ వ్యక్తి ఏకే సింగ్.. 2.ఆర్ వశిష్ఠ్. మొదటి వ్యక్తి ఓకే. రెండో వ్యక్తి గురించి సీనియర్ డీహెచ్‌తో చర్చించాల్సి ఉంది.
రామచంద్ర భారతి :అలాగే నేను ఇంతకుముందు చెప్పిన విషయంలో మీకు సౌకర్యంగా ఉంటే ముందుకెళ్దాం. లేదంటే వదిలేద్దాం. కానీ, ఏకే సింగ్ మన వ్యక్తి. దయచేసి అతడి గురించి సందీప్‌కు చెప్పండి.
సంతోష్:సరే. వశిష్ఠ్ గురించి అప్‌డేట్ చేస్తాను. సతీష్‌ను సంప్రదించాల్సి ఉంది. ఏకే గురించి సందీప్‌కు చెప్పే ప్రయత్నం చేస్తా. నా కాల్ తర్వాత ఆయనను కాంటాక్ట్ చేయండి. థాంక్స్..
వాయిస్‌లను నిర్ధారించిన ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక..:అక్టోబరు 26న ఫామ్‌హౌస్‌లో సైబరాబాద్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ అనంతరం రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్‌ల వాయిస్ రికార్డులను సేకరించారు. ఎఫ్‌ఎస్‌ఎల్(ఫొరెన్సిక్ ల్యాబ్)లో ఆటోమేటిక్ స్పీకర్ ఐడెంటిఫికేషన్ ఎగ్జామినేషన్ ద్వారా వాటిని విశ్లేషించిన అనంతరం అవి నిందితుల వాయిస్‌లే అయ్యేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని తేలింది.
జగ్గుస్వామి, మరో కీలక నిందితుడు మధ్య వాట్సప్ చాటింగ్ సారాంశం..
తెరాస, కాంగ్రెస్ కలిస్తే భాజపాకు ముప్పు..
తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాల గురించి కొన్ని విషయాల్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా. తెరాసను, కాంగ్రెస్‌లో కలిపే విషయంలో దిగ్విజయ్‌సింగ్, కేసీఆర్ మధ్యలో సమావేశం జరిగింది. సోనియాను ఒప్పించడం కోసం చర్చించారు. ఇది భాజపాకు అత్యంత ప్రమాదకర పరిణామం. నా బృందంలోని సభ్యుడు మూడేళ్లుగా తెలంగాణలో పని చేస్తున్నాడు. అతడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా ఉన్న రాజనర్సింహకు అత్యంత సన్నిహితుడు. దళిత, రెడ్డి సామాజికవర్గాల్లో రాజనర్సింహకు బలమైన మద్దతుంది. 20 నియోజకవర్గాల్లో 75 వేల చొప్పున ఓటు బ్యాంకుంది. ప్రభుత్వంలో జరిగే అవకతవకల గురించి అతడి వద్ద సమాచారముంది. మరోవైపు కేసీఆర్ బృందంలోని వ్యక్తి అమిత్‌జీని సంప్రదించారు. అతడు భాజపాలోకి వస్తే మనం ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. మీరు సాధ్యమైనంత తొందరగా సమయం కేటాయించండి.
ఏపీలో చాలా మంది ఎమ్మెల్యేలు జగన్‌పై వ్యతిరేకతతో ఉన్నారు..:ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహన్‌రెడ్డి అవినీతికి, కన్వర్షన్స్‌కు వ్యతిరేకంగా మన బృందమే పని చేస్తోంది. వైకాపాపై సొంతపార్టీ నేతల్లోనే నిర్లిప్తత కనిపిస్తోంది. కుటుంబ సంబంధ వ్యవహారాల కారణంగా సొంత ఎమ్మెల్యేలే చాలా మంది జగన్‌పై వ్యతిరేకతతో ఉన్నారు. జగన్ కంటే షర్మిలకే మంచి పేరుంది. వైకాపా నుంచి 55 మంది ఎమ్మెల్యేలు.. ఇతర పార్టీలకు చెందిన 20 మంది నేతలు భాజపాలో చేరేందుకు ఉత్సుకతతో ఉన్నారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసి అంతే మెజారిటీతో గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. దీన్ని సాధ్యమైనంత తొందరగా సాకారం చేయగలిగితే తెలంగాణాలోనూ మనకు లబ్ధి కలిగిస్తుంది. ఆలస్యం చేయకుండా దీని గురించి చర్చిస్తే మంచిది.