MLAs Poaching Case: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు ఇచ్చిన సిట్ నోటీసులను రద్దు చేయాలన్న.. బీజేపీ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. బీఎల్ సంతోష్ పోలీసుల విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే తదుపరి ఆదేశాలిచ్చే వరకు సంతోష్‌ను మాత్రం అరెస్ట్ చేయొద్దని హైకోర్టు సిట్ అధికారులను ఆదేశించింది. దిల్లీ పోలీసులు సైతం సిట్ విచారణకు సహకరించాలని హైకోర్టు తెలిపింది. రాజకీయ కక్ష్యల కారణంగానే బీఎల్ సంతోష్‌కు సిట్ అధికారులు నోటీసులిచ్చారని.. 41ఏ సీఆర్పీసీ ఇవ్వడం సరైంది కాదని భాజపా నాయకుడు ప్రేమేందర్ రెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు అత్యవసరంగా విచారించింది.
జాతీయ పార్టీకి ప్రధాన కార్యదర్శి ఉన్న సంతోష్‌ను విచారణ పేరుతో నోటీసులివ్వడంతో పాటు అరెస్ట్ చేయాలని సిట్ అధికారులు చూస్తున్నారని.. రాజకీయ కారణాలతో చేపడుతున్న ఈ చర్యలు మంచివి కావని పిటిషనర్ తరఫు న్యాయవాది వైద్యనాథన్ కోర్టు దృష్టికి తీసుకెల్లారు. ఈ కేసుకు సంతోష్‌కు ఎలాంటి సంబంధం లేదని.. నిందితులుగా ఉన్న వాళ్లకు మాత్రమే 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇవ్వాలన్న కర్నాటక హైకోర్టు తీర్పును వైద్యనాథన్ ప్రస్తావించారు. నిందితుడు, లేదా అనుమానితుడికి 41ఏ నోటీసులివ్వొచ్చని ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాంచంద్రభారతి, బీఎల్ సంతోష్‌కు వాట్సాప్ సందేశాలు పంపాడని.. వాటిని నివృత్తి చేసుకునేందుకే నోటీసులిచ్చామని పోలీసుల తరఫున వాదించిన అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, ఏఏజీ రాంచందర్ రావు హైకోర్టుకు తెలిపారు.