Twist in Kidnap: తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో యువతి కిడ్నాప్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదంటూ బాధిత యువతి వీడియో విడుదల చేసింది. జానీ అనే యువకుడిని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నట్లు చెప్పిన యువతి.. జానీని ఇష్టపూర్వకంగా ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు పెళ్లి చేసుకున్న వీడియోలను జానీ, షాలినిలు విడుదల చేశారు.
ఈ సందర్భంగా తన కోరికపైనే జానీ తనను తీసుకెళ్లాడని షాలిని పేర్కొంది. తమ తల్లిదండ్రులు వేరే సంబంధాలు చూస్తున్నారని.. వచ్చి తీసుకెళ్లమని జానీకి తానే ఫోన్ చేసి చెప్పానని తెలిపింది. తీసుకెళ్లే ముందు మాస్క్ ఉండటం వల్ల గుర్తుపట్టలేదన్న ఆమె.. గుర్తుపట్టిన తర్వాత ఇష్టపూర్వకంగా వెళ్లి పెళ్లి చేసుకున్నానని స్పష్టం చేసింది.