Stamps and Registrations Department Revenue : తెలంగాణ రాష్ట్ర ఖజానాకు వాణిజ్య పన్నుల శాఖ, ఎక్సైజ్ శాఖల తరువాత అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ. ఈ రాబడి క్రమంగా పెరుగుతోంది. రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరగకపోయినా 2022లో రెండుసార్లు ఛార్జీలు పెంచడం.. ఆదాయం పెరుగుదలకు దోహదం చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 14.54 లక్షల వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు, ఇతర సేవల ద్వారా దాదాపు రూ.10,583 కోట్లు రాబడి సమకూరింది. ఇందులో రూ.7,944 కోట్లు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా రాబడి రాగా.. రూ.1,587 కోట్ల మేర వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చింది.
ప్రతి నెల సగటున రూ.1,175.87 కోట్లు మేర రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ఆదాయం వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.15,600 కోట్లు మేర రాబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. డిసెంబరు నాటికి రూ.10,582 కోట్లు మేర రాబడి రావడంతో నిర్దేశించిన లక్ష్యంలో 67 శాతం వచ్చినట్లయ్యింది. గత ఆర్థిక ఏడాదిలో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.10,997 కోట్ల రాబడి రాగా.. ఈ ఏడాది ఇప్పటికే దాదాపు అంతే మొత్తం ఆదాయం వచ్చింది.